న్యాయవాదులకు రక్షణ కల్పించాలి
అలంపూర్: న్యాయవాదులకు రక్షణ కల్పించాలని అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు కోరారు. అలంపూర్ పట్టణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆదివారం న్యాయవాదులు అలంపూర్ టు హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాదులు జోగుళాంబ అమ్మవారి బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని మహాత్మాగాంధీ, మహాత్మా జ్యోతిబా పూలే, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హైదరాబాద్‌కు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు పెరిగాయని, ఎక్కడో ఒక చోట నిరంతరం భౌతిక దాడుల సంఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకు గురి చేస్తోందన్నారు. అందుకే న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూనియర్ న్యాయవాదులకు రూ.వేల స్టైఫండ్, అందరికి హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. సీఆర్‌పీసీ సెక్షన్ 41(ఏ ), బీఎన్‌ఎస్ సెక్షన్ 35(1) అమైన్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం అమలుతోపాటు డిమాండ్లను పరిష్కరించాలన్నారు. పాదయాత్ర పది రోజులపాటు కొనసాగుతుందని తెలిపారు. పాదయాత్ర బృందం హైదరాబాద్ చేరుకొని రాష్ట్ర గవర్నర్, హైకోర్టు జడ్జి, ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు విన్నవించి వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరసింహ్మ, బార్ అసోసియేషన్ నాయకులు నారాయణరెడ్డి, తిమ్మారెడ్డి, శ్రీధర్ రెడ్డి, గజేంద్ర గౌడ్, ఆంజనేయులు, మధు, వెంకటేష్, హేమంత్ యాదవ్, యాకూబ్, నాగయ్య తదితరులు ఉన్నారు.
పాదయాత్రకు ప్రముఖుల మద్దతు
సమస్యల పరిష్కారం కోసం అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు ప్రముఖ న్యాయవాదులు మద్దతు తెలిపారు. తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, సిట్టింగ్ స్టేట్ బార్ మెంబర్ హనుమంతు రెడ్డి, మహబూబ్‌నగర్ సీనియర్ న్యాయవాది వెంకటేష్, షాద్‌నగర్ న్యాయవాది జగన్‌మోహన్ రెడ్డి ఉమ్మడి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మద్దతు తెలిపారు.


