కొనుగోళ్లలో కొర్రీలు..!
పత్తి రైతుల ఆందోళన
● తేమ శాతం ఎక్కువుందని, నల్లబారిందంటూ తిప్పిపంపుతున్న వైనం
● సీసీఐ కేంద్రం వద్ద రోజుల తరబడి పడిగాపులు
● దళారుల పత్తి యథేచ్ఛగా కొనుగోలు
నిబంధనల పేరుతో..
విత్తు విత్తనం నుంచి పంట చేతికొచ్చేంత వరకు రూ.లక్షలు పెట్టుబడి పెట్టామని.. మరోవైపు భారీ వర్షాలు, అనుకూలించని వాతావరణంతో పంట కొంత మేర నష్టపోయామని, తీరా వచ్చిన పంట విక్రయిద్దామని వస్తే నిబంధనల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎకరాకు 12 క్వింటాళ్లకు బదులు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటన విడుదల చేయడంతో అప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న రైతులు జాతీయ రహదారిపై వాహనాలతో ఇటీవల రెండు సార్లు ఆందోళనకు దిగారు. జిల్లా అధికారులు కలగజేసుకొని.. సమస్య పరిష్కరించారు. సోమవారం సైతం అవే కొర్రీలు పెడుతూ పత్తి రైతులను తిప్పి పంపడం, రోజుల తరబడి ఎదురుచూసేలా చేయడంతో దిక్చుతోచడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉండవెల్లి: ఎకరాకి ఏడు క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తాం.. పత్తిలో తేమ శాతం ఎక్కువైంది.. పత్తి నల్లబారింది.. నాణ్యతగా లేదు.. అంటూ సీసీఐ కేంద్రం నిర్వాహకులు ఎన్నో కొర్రీలు పెడుతుండడంతో పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉండవెల్లి శివారులో జాతీయ రహదారి సమీపంలో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే, ఆది నుంచి ఈ కేంద్రంలో దళారుల రాజ్యం నడుస్తోందనే ఆరోపణలు వినవస్తున్నాయి. సీసీఐ అధికారుల కింద ఉన్న ముగ్గురు వ్యక్తులే మొత్తం దందా నడిపిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. దళారులకు సంబందించిన వాహనాలను యథేచ్ఛగా ముందుకు అనుమతిస్తుండగా.. వీరికి అక్కడున్న మార్కెటింగ్ అధికారులు కూడా ఒత్తాసు పలుకుతున్నారని రైతులు పేర్కొంటున్నారు. తాము స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు పడిగాపులు పడుతుండగా.. దళారులకు మాత్రం స్లాట్ ఎలా బుక్ అవుతుందని, సీసీఐ సిబ్బంది కొందరు వారికి సాయపడుతున్నారని ఆరోపిస్తున్నారు. రోజుల తరబడి ధాన్యం లోడుతో జాతీయ రహదారిపై భయం భయంగా గడుపుతున్నామని.. దళారుల వాహనాలు మాత్రం ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
అన్‌లోడ్ చేశాక తిప్పి పంపారు..
పత్తిలొ తేమ శాతం పరిశీలించాక వాహనాన్ని లోపలికి అనుమతించారు. సగానికిపైగా అన్‌లోడ్ చేశాక సీసీఐ అధికారి వచ్చి వాగ్వాదానికి దిగాడు. 60 క్వింటాళ్లు కొనుగోలు చేయాల్సి ఉండగా.. 40 క్వింటాళ్లే కొనుగోలు చేసి మిగతాది రిజెక్ట్ చేశారు. సీసీఐ అధికారి కేవలం తేమ శాతం మాత్రమే పరిశీలించాలి. వర్షానికి పత్తి కొద్దిగా నల్లబారితే.. క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయమని తిప్పిపంపారు. స్లాట్ సమయం ముగిసిపోతుంది అని చెప్పినా పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలి.
– రామకృష్ణ, పత్తి రైతు, ఉదండాపురం, ఇటిక్యాల మండలం


