విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
గద్వాలటౌన్: విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని డీఈఓ విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో టీషాట్, ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాస్థాయి విద్యార్థుల వార్షిక పోటీలను నిర్వహించారు. బాలవక్త, వ్యాసరచన, క్వీజ్ పోటీలకు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. మల్దకల్ మండలం అమరవాయి జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన కేశవర్థన్ బాలవక్త పోటీల్లో, ధరూర్ జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన శివకుమార్ వ్యాసరచన, మానవపాడు జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన అఖిల్‌సాయి క్విజ్ పోటీల్లో సత్తా చాటారు. వీరిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. బాలవక్త పోటీలలో విజేతగా నిలిచిన విద్యార్థి 12వ తేదీన హైదరాబాద్‌లో టీషాట్ నిర్వహించే లైవ్ ప్రోగ్రాంలో పాల్గొననున్నారు. వ్యాసరచన, క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులు 13వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించే లైవ్ ప్రోగ్రాంలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి పాల్గొని ప్రశంసా పత్రాలు, మెమోంటోలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. మొదటిసారి గ్రామీణ ప్రాంత విద్యార్థులు రాష్ట్రస్థాయి టీషాట్ లైవ్ ప్రోగ్రాంకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. రాష్ట్రస్థాయి పోటీలలో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో సాధన చేస్తే ఏదైనా సాధ్యమని పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులను ప్రోత్సహించినప్పుడే మరింత ముందుకు వెళ్తారన్నారు. కార్యక్రమంలో ప్రతాప్‌రెడ్డి, అశోక్‌కుమార్, హేమలత, మహేష్, నర్సింహాస్వామి, విష్ణు, బాలజీ, కృష్ణకుమార్, వెంకటేశ్వర్‌రెడ్డి, రిటైర్డు ఎంఈఓ రాజు పాల్గొన్నారు.


