అడ్డగోలుగా నియామకాలు..!
పాలమూరు యూనివర్సిటీలో పైరవీలకు పెద్దపీట
●
విచారణ చేపట్టాలి..
ఏ ప్రభుత్వ సంస్థల్లో చేపట్టని విధంగా పీయూలో నియామకాలు చేపడుతున్నారు. యూనివర్సిటీలో నేరుగా భర్తీ చేపట్టిన ఏజెన్సీలను రద్దు చేయాలి. మధ్యవర్తులుగా వ్యవహరించి డబ్బులు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి. నియామకాలపై కమిటీతో విచారణ చేపట్టాలి. – రాము, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు
ఏజెన్సీలే భర్తీ చేస్తాయి..
అవసరాల మేరకు కొల్లాపూర్, గద్వాలతో పాటు పలువురు సిబ్బందిని ఔట్‌సోర్సింగ్ విధానంలో తీసుకున్నాం. గురుకులాలు ఇతర సంస్థలలో నియామకాలు ఎలా చేపడుతున్నారో తెలియదు కానీ యూనివర్సిటీల్లో మాత్రం ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ఏజెన్సీలే భర్తీ చేస్తాయి. అందుకు యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఒకవేళ అర్హత లేని వారిని తీసుకుంటే తొలగిస్తాం.
– రమేష్‌బాబు, రిజిస్ట్రార్, పీయూ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో అధికారులు అడ్డగోలుగా సిబ్బంది నియామకం చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి నోటిఫికేషన్, పత్రికా ప్రకటన, రోస్టర్ విధానం వంటి ప్రక్రియలు చేపట్టకుండా నేరుగా సిబ్బందిని పైరవీల ద్వారా తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా గద్వాల పీజీ సెంటర్, కొల్లాపూర్ పీజీ సెంటర్, పీయూతో పాటు సుమారు 35 నుంచి 36 మంది వరకు సిబ్బందిని వివిధ ఏజెన్సీల ద్వారా నియమించినట్లు సమాచారం. ఇందులో కుక్, హెల్పర్, కేర్ టేకర్, వాచ్‌మెన్ వంటి పోస్టులు ఉన్నాయి. నేరుగా ఏజెన్సీల ద్వారా వీరిని నియమించడంతో ఏజెన్సీలకు పలువురు మధ్యవర్తులుగా ఉండి తమకు కావాల్సిన వారిని చేర్పించారు. ఈ క్రమంలో పలు పోస్టులకు సిబ్బంది నుంచి డబ్బులు సైతం వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ద్వారా వేతనాలు చెల్లిస్తూ.. ఈపీఎఫ్, ఈఎస్‌ఐ వంటి వసతులు కల్పిస్తూ నియమించే ఉద్యోగాలకు బయటి వ్యక్తులు, ఏజెన్సీలు నియమించుకోవడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి. సిబ్బందిని నియమించిన తర్వాత ఆర్డర్లు సైతం ఇవ్వకుండా అధికారుల వద్దే పెట్టుకొని.. నేరుగా వేతనాలు ఇస్తున్నారు.
ఎక్కడెక్కడ ఎంత మంది..
మూడు నెలల క్రితం గద్వాల పీజీ సెంటర్‌లో బాలికలు, బాలుర హాస్టళ్లను అధికారులు ప్రారంభించారు. ఈ క్రమంలో రెండు హాస్టళ్లకు సంబంధించి ఇద్దరు కుక్, ఇద్దరు హెల్పర్, ఒక కేర్ టేకర్, 9 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. అలాగే కొల్లాపూర్ పీజీ సెంటర్‌లో 9 మంది సెక్యూరిటీ సిబ్బంది, కేర్‌టేకర్, కుక్, హెల్పర్ ఒక్కొక్కరిని నియమించారు. అయితే ఈ ప్రక్రియలో పలువురు మధ్యవర్తులుగా కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. దీంతో పాటు పీయూలో కేర్‌టేకర్లు, కుక్‌లు, సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. ఇందులో ఓ మహిళా అధికారి పలువురు సిబ్బందిని నియమించేందుకు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. పలువురు సిబ్బందితో డబ్బులు తీసుకోవడంతోపాటు భవిష్యత్‌లో నియమించే పోస్టులకు సైతం ముందస్తు ఒప్పందాలను సదరు మహిళ చేసుకున్నట్లు సమాచారం. ఇందుకు ఏజెన్సీలో పనిచేసే మరో వ్యక్తి సైతం సిబ్బంది నియామకాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాలన్నీ వీసీ, రిజిస్ట్రార్‌లకు తెలిసినా వారికే మద్దతుగా నిలుస్తున్నట్లు సమాచారం.
నిబంధనలకు విరుద్ధంగా..
అన్ని విద్యాసంస్థలకు ఔట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగుల భర్తీని ప్రభుత్వం చేపడుతుంది. అందులో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలతో పాటు యూనివర్సిటీలకు కూడా ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని నియమించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో గురుకులాల్లో స్కావెంజర్ పోస్టు నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు సిబ్బందిని నియమించాలంటే తప్పకుండా పత్రికా ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించి మెరిట్ మార్కులు, తదితర స్కిల్స్‌కు సంబంధించి సర్టిఫికెట్, రిజర్వేషన్ తదితర అంశాల ఆధారంగా రోస్టర్ తయారు చేయాల్సి ఉంటుంది. ఇందులో మొదటి పాయింట్ వచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. అనంతరం ఎంపిక చేసిన వారిని ఏజెన్సీలకు అప్పగించి ఆర్డర్స్ ఇస్తారు. కానీ, యూనివర్సిటీ అధికారులు మాత్రం ఇవేమీ పట్టనట్లు కేవలం ఏజెన్సీలు తీసుకువచ్చి చూపించిన వారికే ఉద్యోగాలు ఇవ్వడం కొసమెరుపు. అంతేకాకుండా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ద్వారా కూడా సీనియార్టీ ఆధారంగా కూడా భర్తీ చేసే విధానం ఉంది.
ఉన్న వారికి జీతాలేవీ?
పీయూలో పనిచేస్తున్న 42 మంది పార్ట్‌టైం లెక్చరర్లకు కొన్ని నెలలుగా పూర్తిస్థాయిలో వేతనాలు అందడం లేదు. పని ఒత్తిడి తగ్గించడంతో వేతనాలు పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇక ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి రెండు నెలల వేతనాలు ఇవ్వలేదు. దసరా, దీపావళి పండగలకు సైతం వేతనాలు ఇవ్వకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు సెక్యూరిటీ సిబ్బందికి సైతం రెండు నెలల వేతనాలు ఇవ్వాల్సి ఉండగా 10 రోజుల క్రితం ఒకనెల వేతనం రూ.10 వేలు ఖాతాలో జమచేశారు. గతంలో రూ.11 వేలు ఇవ్వగా ప్రస్తుతం దాన్ని రూ.వెయ్యి తగ్గించి ఇవ్వడాన్ని సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వేతనం పెంచాల్సింది పోయి తగ్గించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల గద్వాల పీజీ సెంటర్ 14, కొల్లాపూర్ పీజీ సెంటర్‌లో 11 మంది నియామకం
యూనివర్సిటీలోనూ 9 మంది వరకు అవకాశం..
ఎలాంటి ప్రకటనలు, రోస్టర్ విధానం లేకుండా చేపట్టడంపై విమర్శలు
మధ్యవర్తులు చెప్పిన వారికే ఉద్యోగాలు?
అడ్డగోలుగా నియామకాలు..!
అడ్డగోలుగా నియామకాలు..!


