జూరాల రహదారికి మోక్షం | - | Sakshi
Sakshi News home page

జూరాల రహదారికి మోక్షం

Nov 10 2025 8:24 AM | Updated on Nov 10 2025 8:24 AM

జూరాల

జూరాల రహదారికి మోక్షం

అమరచింత: ఉమ్మడి జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రహదారి మరమ్మతులకు పీజేపీ అధికారులు ప్రతిపాదనలు పంపగా.. ప్రభుత్వం రూ.30 లక్షలు మంజూరు చేసింది. దీంతో అధికారులు త్వరలోనే టెండర్లను ఆహ్వానించి పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. నందిమళ్ల క్యాంపు నుంచి ప్రాజెక్టు మీదుగా గద్వాల, రాయచూర్‌ ప్రాంతాలకు నిత్యం వేలాది మంది తమ వ్యక్తిగత, వ్యాపార పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుండటంతో వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. వీటితోపాటు జూరాల ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల పర్యాటకులు సైతం వస్తుంటారు. 4.50 కిలోమీటర్ల మేర ఉన్న ప్రాజెక్టు ప్రధాన రహదారి గుంతలుపడి అధ్వానంగా మారడంతో ప్రయాణికులు, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు రహదారిపై గద్వాలకు వెళ్తుండటంతో అప్పట్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన పీజేపీ అధికారులు.. నేటి వరకు పూర్తిస్థాయి మరమ్మతులకు పూనుకోకపోవడంతో రహదారిపై ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. ప్రస్తుతం నిధులు మంజూరు కావడం.. మరమ్మతుకు నోచుకోవడంతో రాకపోకల కష్టాలు తొలగిపోనున్నాయి.

అడుగుకో గుంత..

పీజేపీ నందిమళ్ల క్యాంపు నుంచి రేవులపల్లి వరకు జూరాల జలాశయం ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. అడుగడుకో గుంత ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్నిచోట్ల చిన్న గుంతలు, మరికొన్ని చోట్ల రహదారి మధ్యలో భారీ గుంతలు ఏర్పడటంతో రాకపోకల సమయంలో వాహనాల టైర్లు దెబ్బతింటున్నాయని భారీ వాహన డ్రైవర్లు వాపోతున్నారు. దీనికితోడు ఎదురుగా వస్తున్న ద్విచక్ర, ఆటోలను తప్పించబోయి ప్రమాదాల బారినపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రత్యేక రాష్ట్రంలో ప్రాజెక్టు రూపురేఖలు మారుతాయని ఈ ప్రాంత ప్రజల ఆశలు నేటికీ పూర్తిస్థాయిలో నెరవేరలేకపోతున్నాయి. ప్రస్తుతం రహదారి మరమ్మతుకు నిధులు మంజూరయ్యాయని తెలియడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరమ్మతుకు

రూ.30 లక్షలు మంజూరు

బాగుపడనున్న 4.50 కిలోమీటర్ల రోడ్డు

టెండర్ల ఆహ్వానానికి సిద్ధమవుతున్న అధికారులు

తీరనున్న ప్రయాణికుల కష్టాలు

కుడి, ఎడమ కాల్వల పరిధిలో..

ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పరిధిలోని రహదారి పూర్తిస్థాయిలో దెబ్బతినడంతో ద్విచక్ర వాహనదారులు సైతం వ్యయ ప్రయాసాలకోర్చి రాకపోకలు సాగించే దుస్థితి నెలకొంది. దీనికితోడు ఎడమ కాల్వ వద్ద చేప వంటకాల విక్రయ కేంద్రాలు ఉండటంతో పర్యాటకులతో పాటు చేప వంటకాలు ఆరగించేందుకు ప్రజలు రోజు వేలాదిగా సొంత వాహనాల్లో ఇక్కడికి వస్తుంటారు. వాహనాలన్నీ కాల్వ సమీపంలోని ప్రధాన రహదారిపై నిలుపుతుండటంతో వచ్చి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జూరాల రహదారికి మోక్షం 1
1/1

జూరాల రహదారికి మోక్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement