భూసార పరీక్షలు తప్పనిసరి
గట్టు: ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జగ్గునాయక్ సూచించారు. మంగళవారం మండలంలోని ఆరగిద్ద రైతువేదికలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు భూసార పరీక్షలకు సంబంధించిన ధ్రువపత్రాలను ఆయన అందజేసి మాట్లాడారు. మట్టి పరీక్షల ఫలితాల ఆధారంగా పంటలు సాగుచేసి.. అవసరం మేరకు ఎరువులు వినియోగించాలని సూచించారు. రైతులు విచ్చలవిడిగా రసాయనిక ఎరువుల వినియోగంతో భూసారం తగ్గుతుందన్నారు. పంటల సాగులో సేంద్రియ ఎరువుల వాడాకాన్ని పెంచాలన్నారు. ఏడీఏ సంగీతలక్ష్మి మాట్లాడుతూ.. ఎఫ్‌ఏక్యూ ప్రమాణాల మేరకు రైతులు పత్తిని ఆరబెట్టుకొని తేమశాతం 8 ఉండే విధంగా చూడాలని తెలిపారు. తద్వారా మద్దతు ధర రూ. 8,110 లభిస్తుందన్నారు. వానాకాలంలో రైతులు పండించిన వరిధాన్యంలో తేమ 17శాతంలోపు ఉండాలని.. తాలు, మట్టి లేకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించాలని కోరారు. వరికోత మిషన్‌లో గేర్ స్టోన్‌ను ఏ–2 నుంచి బీ–1లోకి పెట్టి కోతలు కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హనుమంతురెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్, ఏఈఓలు తిరుమలేష్, తోహిద్, అలివేలు, శ్రావణి, వీరేశ్, ప్రకాశ్, భార్గవి తదితరులు పాల్గొన్నారు.


