భూపాలపల్లి అర్బన్: ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27న కలెక్టరేట్‌లో నిర్వహించనున్న మహాధర్నాకు ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ బూరుగు రవికుమార్, కన్వీనర్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ.. మహాధర్నాలో అన్ని భాగస్వామ్య సంఘాలు, యూనియన్ల ప్రతినిధులు తమ సంఘాల బ్యాడ్జీలు ధరించి, నల్ల రిబ్బన్లు కట్టుకుని పాల్గొనాలని కోరారు. 27నుంచి విధులకు హాజరయ్యే సమయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సెప్టెంబర్ 1న నిర్వహించనున్న పెన్షన్ విద్రోహ దినం కార్యక్రమంలో ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొని నిరసన తెలియజేయాలని కోరారు. సెప్టెంబర్ 10న నిర్వహించనున్న మహాధర్నా–చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని భాగస్వామ్య సంఘాలు, యూనియన్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ అశోక్‌కుమార్‌కు నిరసన కార్యక్రమాల పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు సుభాకర్‌రెడ్డి, దశరథ రామారావు, షఫీసర్కార్ పాల్గొన్నారు.
టీజీఈజేఏసీ చైర్మన్ బూరుగు రవికుమార్


