భూపాలపల్లి అర్బన్: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు పీసీపీఎన్‌డీటీ చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్ట ప్రకారం జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించబడుతుందని హెచ్చరించారు. స్కానింగ్ పరికరాలను నిర్వహిస్తున్న వైద్యుల పూర్తి వివరాలను ప్రతి కేంద్రంలో నమోదు చేయాలని ఆదేశించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణను పూర్తిగా అరికట్టేందుకు బాధ్యతగా వ్యవహరించాలని డాక్టర్ మధుసూదన్ కోరారు. ఈ సమావేశంలో పీఓ ఎంసీహెచ్ డాక్టర్ శ్రీదేవి, డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ దేవేందర్, పీడియాట్రిషన్ డాక్టర్ సుధాకర్, గైనకాలజిస్ట్ డాక్టర్ సంధ్య, ఎన్జీఓ ప్రతినిధి శ్యాంప్రసాద్, డెమో శ్రీదేవి పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్


