ఏర్పాట్లు పూర్తి చేశాం..
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో శ్రావణమాసం సందర్భంగా శ్రీకాళేశ్వరముక్తీశ్వర స్వామి ఆలయం అనుబంధ దేవాలయమైన శ్రీఆదిముక్తీశ్వర స్వామి ఆలయం, బాలాలయంలో ఉత్సవ మూర్తులను దర్శించుకోవడానికి రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు. ఈనెల 13 (గురువారం) నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు శ్రావణమాసం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్ధరణ నేపద్యంలో పాత ఆలయాలను కూల్చివేస్తున్నారు. దీంతో జూన్ 17 నుంచి అడవిలో వెలసిన ఆదిముక్తీశ్వరస్వామి ఆలయంలో ప్రధాన ఆలయంలోని ఉత్సవ మూర్తులను ఆసీనులు చేసి పూజిస్తున్నారు.
ఏర్పాట్లు ఇలా..
ఈ ఏడాది శ్రావణమాసంలో ఆదిముక్తీశ్వరాలయంలో పూజలకు సిద్ధం చేశారు. ముఖ్యంగా క్యూలైన్‌లు, లడ్డుపులిహోర కౌంటర్లు ఏర్పాటు చేశారు. బాలాలయంలో ఉత్సవ మూర్తుల దర్శనాలు, ఆదిముక్తీశ్వరాలయంలో అభిషేక పూజలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ఆలయంలో స్థల ప్రభావంతో లక్షపత్రి పూజలను రద్దు చేశారు. రెండవ వారంలో వరలక్ష్మీవ్రతాలు నిర్వహిస్తారు. తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ కోసం కొంత మేర ఏర్పాట్లు చేశారు.
తగ్గనున్న భక్తుల రాక
పునర్నిర్మాణం జరుగుతున్న నేపద్యంలో పాత ఆలయాలన్ని కూల్చి వేస్తున్నారు. ఈక్రమంలో ఆదిముక్తీశ్వరాలయంలో పూజలు నిర్వహిస్తున్న నేపద్యంలో భక్తులు ప్రధాన ఆలయానికి వచ్చినట్లు ఇక్కడికి వచ్చే అవకాశం లేదని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం జీర్ణోద్ధరణ నేపథ్యంలో ఆలయం పునర్నిర్మాణం జరుగుతున్నందున ఆదిముక్తీశ్వరాయలంలో ఏర్పాటు చేశాం. బాలాలయంలో దర్శనాలు, ఆది ముక్తీశ్వరాలయంలో అభిషేక పూజలకు సర్వం సిద్ధం చేశాం. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం.
– మహేష్, ఈఓ, కాళేశ్వరం దేవస్థానం
కాళేశ్వరంలోని బాలాలయంలో
ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు
వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాక
దేవస్థానం జీర్ణోద్ధరణ నేపథ్యంలో
తగ్గనున్న భక్తులు


