● ఎన్ క్వాస్‌లో జిల్లాలో
23 సెంటర్ల ఎంపిక
● మూడేళ్లు గడుస్తున్నా
అందని ప్రోత్సాహకాలు
భూపాలపల్లి అర్బన్: ఎన్ క్వాస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్)కు జిల్లాలో 2023లో 23 సెంటర్ల ఎంపికైనా ఇప్పటివరకు ప్రోత్సాహకాలు మాత్రం రూపాయి కూడా విడుదల కాలేదు. 23 ఆస్పత్రుల్లో నాణ్యతా ప్రమాణాలు, వైద్యసేవలు బాగున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించి మూడేళ్లవుతున్నా నిధులు మంజూరు చేయకపోవడంతో ఉపయోగం లేకుండా పోతోంది. వరుసగా మూడేళ్లు ప్రోత్సాహకాలు అందజేయాల్సి ఉండగా ఆ సమయం కూడా దాటిపోయింది.
కేంద్ర బృందం పరిశీలించి..
జిల్లాలో 13 పీహెచ్‌సీలు, 2 సీహెచ్‌సీలు, 75 హెల్త్‌వెల్‌నెస్ సెంటర్లు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులలో నాణ్యత ప్రమాణాలతో వైద్యసేవలు అందించడం, అవసరమైన మందులు నిల్వలు, రికార్డుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం వంటి ఎనిమిది విభాగాలను పరిశీలించి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్ (ఎన్ క్వాస్)కు ఎంపిక చేస్తారు. కేంద్ర బృందం వచ్చి ఈ అంశాలను పరిశీలన జరిపి, ఎంపిక చేస్తుంది. ఇలా ఎంపికై న వాటికి మూడేళ్లపాటు ఏటా నిధులు విడుదల చేస్తారు. కానీ జిల్లాలో 2023 సంవత్సరంలో జిల్లాలో 23 ఆస్పత్రులను ఎంపిక చేశారు. ఎంపికై న నాటి నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఇదిలా ఉండగా.. మళ్లీ కొత్త ఆస్పత్రుల ఎంపికకు కసరత్తు చేయడం గమనార్హం.
ప్రోత్సాహకాలు ఎంత ఇస్తారంటే..
● ప్రతి ఆరోగ్య కేంద్రానికి ఏడాదికి రూ.3లక్షల చొప్పున మూడేళ్లలో రూ.9లక్షలు కేటాయిస్తారు.
● పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఏటా రూ.2లక్షలు, మూడేళ్లకు రూ.6లక్షలు ఇస్తారు.
● పల్లె దవాఖానాలు, సబ్‌సెంటర్లకు ఏటా రూ.1.50 లక్షల చొప్పున రూ.4.50లక్షలు మంజూరు చేస్తారు.
నిధులు మంజూరైతే అభివృద్ది
జిల్లా వ్యాప్తంగా ఎంపికై న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, హెల్త్ వెల్‌నెస్ సెంటర్లకు నిధులు మంజూరైతే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు కేంద్రం నుంచి వచ్చే నిధులతో మూడేళ్ల పాటు మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఉంటుంది. ఎన్‌హెచ్‌ఎం నిధుల కొరత కారణంగా ప్రోత్సాహకాలు నిలిచిపోయినట్లు తెలిసింది.


