వర్షాభావ పరిస్థితులతో ప్రత్యామ్నాయ పంటలకు మొగ్గు | - | Sakshi
Sakshi News home page

వర్షాభావ పరిస్థితులతో ప్రత్యామ్నాయ పంటలకు మొగ్గు

Jul 24 2026 1:03 AM | Updated on Jul 24 2026 1:03 AM

ఆరుతడి పంటలు సాగు చేయాలి..

భూపాలపల్లి రూరల్‌: జూలై మాసం ముగుస్తున్నా వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం, భూగర్భ జలాలు క్రమంగా తగ్గిపోతుండడం, ఎల్‌నినో ప్రభావం ఉండొచ్చని వ్యవసాయశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో రైతులు ఈ వానాకాలం సాగు విధానాన్ని మార్చుకుంటున్నారు. గతంలో ప్రధానంగా వరిపైనే ఆధారపడిన రైతులు ఈసారి ఆరుతడి పంటలు, ముఖ్యంగా కంది, మినుములు, పెసర వంటి పప్పుధాన్యాల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ఇప్పటికే వర్షాధారంగా సాగుచేసే పత్తి విస్తీర్ణం అనేక మండలాల్లో పెరిగింది. నీటి లభ్యతపై స్పష్టత వచ్చే వరకు వరి నాట్లను వాయిదా వేస్తూ ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకుంటున్నారు. జిల్లాలోని పలు మండలాల రైతులు చేసిన సేద్యాన్ని పరిశీలిస్తే వరి సాగు అంచనాలు గణనీయంగా తగ్గగా, పత్తి సాగు ఆశించిన దానికంటే ఎక్కువగా నమోదవుతోంది.

వరి సాగుకు వెనుకడుగు..

ఎల్‌నినో ప్రభావంతో రైతులు వరిసాగుకు వెనుకడుగు వేస్తున్నారు. భూపాలపల్లి మండలంలో ప్రతిఏటా 10వేల ఎకరాల్లో వరి సాగయ్యేది. ఈసారి అది నాలుగు వేల ఎకరాలకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా మండలాల్లో పత్తి సాగు గణనీయంగా పెరుగుతోంది. జిల్లాలో ప్రతి మండలంలో పెసర, కంది పంటలు రైతులు సాగు చేయడానికి ముందడుగు వేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ బత్తాయి, నిమ్మ, మామిడి, ఆయిల్‌పామ్‌ తోటల విస్తీర్ణం జిల్లాలో స్థిరంగా కొనసాగుతోంది.

పత్తికే ప్రాధాన్యం..

పత్తి పంటకు ఒడిదొడుకులు లేకుండా స్థిరంగా ధర పలుకుతుండటంతో రైతులు జిల్లాలో పత్తి పంటకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతేడాది 91,500 ఎకరాల్లో పత్తిసాగు చేయగా.. ఈ ఏడాది 1,04,940 ఎకరాల్లో సాగు చేశారు. జూన్‌ నెలలో వర్షాలు లేకపోవడంతో పత్తి విత్తనాలు మొలకెత్తక పోవడంతో రైతులు రెండోసారి విత్తనాలు విత్తారు. క్రమంగా అడపాదడపా చిరుజల్లులుగా వర్షాలు కురువడంతో ఇప్పడు పత్తి మొక్కలు నిగనిగలాడుతున్నాయి.

వర్షభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు వరి సాగు కన్నా ఆరుతడి పంటలు, కంది, పెసర, మినుములు, నీటి వినియోగం తక్కువగా ఉన్న పంటలను సాగుచేస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుంది. జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో వ్యవసాయక్షేత్రాల్లో రైతులకు పంటల మార్పడిపై అవగాహన కల్పిస్తున్నాం. అధికారుల సూచనలు రైతులు పాటించాలి.

– బాబురావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

వరి 2,075

పత్తి 1,04,940

మొక్కజొన్న 57

పెసర 69

జనుము 250

జీలుగ 6,148

ఎల్‌నినో ప్రభావంతో సాగు విధానాన్ని మార్చుకుంటున్న రైతులు

పత్తికే ప్రాధాన్యం.. తగ్గనున్న వరిసాగు

పెరగనున్న ఇతర పంటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement