డిజిటల్‌ బోధన | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ బోధన

Jul 10 2026 5:28 AM | Updated on Jul 10 2026 5:28 AM

ఏజెన్సీ ద్వారా.. రెండు బడులకు ఒకరు.. 2008లోనే ప్రారంభం..

విద్యార్థుల్లో పెరగనున్న పరిజ్ఞానం

సర్కారు బడిలో కంప్యూటర్‌ విద్య

భూపాలపల్లి అర్బన్‌: సర్కారు బడుల్లో డిజిటల్‌ బోధనను బలోపేతం చేయడం, విద్యార్థులకు కంప్యూటర్‌ పాఠాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో ఎంపికచేసిన పాఠశాలలకు కంప్యూటర్లు సరఫరా చేయగా.. బోధకులు లేక నిరుపయోగంగా ఉన్నాయి. కాలానుగుణంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో రెండేళ్ల కిందట ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమమేధ(ఏఐ)పై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎంపిక చేసిన పాఠశాలలకు కంప్యూటర్లు సైతం అందించింది. అనుభవమున్న ఉపాధ్యాయులతో కొంతకాలం బోధన చేపట్టారు. పూర్తిస్థాయిలో బోధకులు లేకపోవడంతో ల్యాట్‌లు నిరుపయోగంగా మారాయి. ఈ నేపథ్యంలో బోధకుల నియామకాలు చేపట్టేందుకు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు.

కంప్యూటర్‌ విద్యను పునరుద్ధరించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్‌ పాఠాలు బోధించేందుకు సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆయా పాఠశాలలకు ఇన్‌స్ట్రక్టర్లను ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఏజెన్సీ ద్వారా నియమించనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. డీఈఓ, ఎంఈఓలు కలిసి పాఠశాలల మ్యాపింగ్‌, పాఠశాలల కేటాయింపు అనంతరం మరో మూడు రోజులలోగా కేటాయించిన పాఠశాలల్లో చేరేలా కార్యాచరణ సిద్ధం చేశారు.

జిల్లాలో కంప్యూటర్లు ఉన్న 36 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, కస్తూర్బాలు, గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, పీఎంశ్రీ బడులు ఉన్నాయి. ఈ పాఠశాలల్లోనే బోధకుల నియామకాన్ని చేపట్టనున్నారు. రెండు పాఠశాలలకు ఒక బోధకుడి చొప్పున మొత్తం 18 మందిని నియమించనున్నారు. వారు బోధించేందుకు వీలుగా తక్కువ దూరం కలిగిన రెండు పాఠశాలలు కలిపి మ్యాపింగ్‌ చేస్తారు. ఆయా పాఠశాలల్లో బోధనల పర్యవేక్షణకు ప్రతి జిల్లాలో ఒక ఇన్‌చార్జ్‌ అధికారిని నియమిస్తారు. జిల్లాలో శివబాలాజీ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో ఇన్‌స్ట్రక్టర్ల నియామకం జరుగుతుంది.

2008 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యాబోధనను ప్రారంభించింది. అధునాతన కంప్యూటర్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి ఇంటర్‌నెట్‌ సదుపాయాన్ని సైతం కల్పించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత 2014 నుంచి కంప్యూటర్‌ విద్య కనుమరుగైంది. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ ల్యాబ్‌లు నిరుపయోగంగా మారి ధ్వంసమయ్యాయి. ఇప్పడు మళ్లీ కంప్యూటర్‌ విద్యపై ప్రభుత్వం దృష్టిపెట్టింది.

కంప్యూటర్‌ విద్యను మళ్లీ ప్రారంభించడం విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతో కీలకమైన నిర్ణయం. దీంతో విద్యార్థుల్లో ప్రాధమిక కంప్యూటర్‌ పరిజ్ఞానం పెరగడంతో పాటు సాంకేతికతపై అవగాహన ఏర్పడుతుంది. ఎంఎస్‌ వర్డ్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌ వంటి ప్రాథమిక సాఫ్ట్‌వేర్‌ను నేర్పిస్తారు. ప్రాజెక్ట్‌లు, అసైన్‌మెంట్‌లు, ప్రజెంటేషన్‌లు తయారు చేసే సామర్ధ్యం పెరుగుతుంది.

జిల్లాలో 36 పాఠశాలలు ఎంపిక

పదమూడేళ్ల తర్వాత పునఃప్రారంభం

ఏజెన్సీ ద్వారా ఇన్‌స్ట్రక్టర్ల నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement