భూపాలపల్లి: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జె.జీవన్‌కుమార్‌ను గురువారం కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ వేర్వేరుగా కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.అఖిల పాల్గొన్నారు.
విద్యార్థినులకు షీ టీం
అవగాహన
మల్హర్(కాటారం): కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు గురువారం జిల్లా షీ టీం ఎస్సై ఫజల్‌ఖాన్ ఆధ్వర్యంలో భరోసా బృందం సభ్యులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గురించి వివరించి, ఎలా అప్రమత్తంగా ఉండాలో సూచించారు. ఎస్సై ఫజల్‌ఖాన్ మాట్లాడుతూ.. విద్యార్థినులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలు సాధించాలని కోరారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. పాఠశాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కని పిస్తే వెంటనే ఉపాధ్యాయులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 సేవలను వినియోగించాలని కోరారు.
బాధిత కుటుంబానికి
అండగా ఉంటా
మహాముత్తారం: కాటారం మండలకేంద్రంలో ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో హెల్త్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మహాముత్తారం మండలం నిమ్మగూడెం గ్రామానికి చెందిన తేజావత్ సమ్మయ్య గత రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. గురువారం నిమ్మగూడెం గ్రామంలో అతని దహన సంస్కారాలు నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని డీఎంహెచ్‌ఓ మధుసూదన్ పరామర్శించారు. సమ్మయ్య కుటుంబసభ్యులకు అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు. డీఎంహెచ్‌ఓ వెంట మహాముత్తారం, కాటారం వైద్యసిబ్బంది ఉన్నారు.
విద్యుత్ సమస్యలపై
ప్రత్యేక దృష్టి
మల్హర్: విద్యుత్ వినియోగదారుల సమస్యలపై ప్రత్యేక దృష్టిసారిస్తామని ఎన్పీడీసీఎల్ సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ నాగప్రసాద్ అన్నారు. గురువారం మండలంలోని కొయ్యూరు సబ్‌స్టేషన్ ఆవరణలో కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మల్హర్, కాటారం, మహాముత్తారం, మహదేవపూర్, పలిమెల మండలాల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా నాగప్రసాద్ వినియోగదారులతో ముఖాముఖి మాట్లాడి పలు సమస్యలపై 26 దరఖాస్తులు స్వీకరించారు. అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సభ్యులు, అధికారులు సత్యనారాయణ, రామారావు, భూపాలపల్లి సూపరింటెండింగ్ ఇంజనీర్ రమేష్, కాటారం డివిజన్ ఇంజనీర్ నాగరాజు, ఏఈలు రమేష్, శేఖర్ పాల్గొన్నారు.
మీసేవ కేంద్రాల్లో
యూరియా బుకింగ్
భూపాలపల్లి అర్బన్: రైతులకు అవసరమైన యూరియా ఎరువులను సకాలంలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీసేవ కేంద్రాల ద్వారా యూరియా ముందస్తు బుకింగ్ సేవలను ప్రారంభించినట్లు ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీకాంత్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వివరాలతో సమీప మీసేవ కేంద్రంలో రూ.10 సేవా రుసుం చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చన్నారు. పోడు పట్టాలు కలిగిన రైతులు, డిజిటల్ సంతకం పూర్తికాని భూముల పట్టాదారులు కూడా ఆధార్ ఆధారంగా ఈ సేవను వినియోగించుకోవచ్చని తెలిపారు.


