బ్రహ్మోత్సవాలకు వేళాయె
రేగొండ: భక్తుల కొంగు బంగారంగా విరజిల్లుతున్న కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం అభిషేకం, సూర్యవాహన సేవ, సాయంత్రం స్వస్తి వాచనము, శేషవాహనము సేవ (పుట్టబంగారం సేవ), అంకురారోహణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నారు.
తరలిరానున్న భక్తజనం
కోటంచ బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. భూపాలపల్లి జిల్లాతో పాటు ములుగు, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తనున్నారు. జాతరలో ప్రత్యేక ఆకర్షణగా ప్రభ బండ్లు నిలువనున్నాయి. జాతరకు వచ్చే భక్తులు తమ వాహనాలను ఆలయ మాఢవీధుల గుండా మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేసుకున్న తర్వాతనే విడిది చేయడం ఇక్కడి ఆనవాయితీ. భక్తుల రవాణా సౌకర్యం కోసం పరకాల, భూపాలపల్లి డిపోల నుంచి ప్రత్యేక బస్ సర్వీస్‌లను ఏర్పాటు చేశారు.
ఏర్పాట్లు పూర్తి
కొడవటంచ ఆలయానికి ప్రభుత్వం రూ.12.15 కోట్ల నిధులు మంజూరు చేయడంతో ఆలయ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అలాగే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం అతిథి గృహాలు నిర్మించడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు బస చేసే సౌకర్యం ఉండటంతో అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. భక్తుల తాగునీటి వసతి కోసం ప్రభుత్వం రూ.86.90 లక్షలు మంజూరు చేసింది. దీంతో ఆలయ ప్రాంగణంలో 1.5 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ నిర్మాణంతో పాటు, వసతి గృహాలకు తాగునీరు సరఫరా చేసేందుకు పైపులైన్ వేశారు. ఆలయ ఆవరణలో రూ.1.2 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. జాతరలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.
నేటి నుంచి లక్ష్మీనరసింహస్వామి జాతర
కోటంచకు పోటెత్తనున్న భక్తజనం
ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాలకు వేళాయె


