కోటివరాల కొడవటంచ
కార్యక్రమాల నిర్వహణ ఇలా..
మహిమాన్వితుడిగా లక్ష్మీనరసింహస్వామి
రేగొండ: భక్తజన బాంధవుడిగా పేరుగాంచిన కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రేపటి (గురువారం) నుంచి ప్రారంభమై వారం రోజులపాటు వైభవంగా కొనసాగునున్నాయి. ఇటీవలే స్వామి వారి పున:ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వాహకులు వైభవంగా చేపట్టారు. కొడవటంచ లక్ష్మీనరసింహస్వామిని కొలిస్తే కష్టాలు తీరుతాయని భక్తుల విశ్వాసం. వందల ఏండ్ల చరిత్ర కలిగిన కొడవటంచ క్షేత్రానికి రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతోంది. ఈనేపథ్యంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా 27న కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ బాధ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కొడవటంచ క్షేత్రం నిత్యపూజలతో భక్తిపారవశ్యంతో పొంగిపోతుంది. వందల సంవత్సరాల క్రితం వెలసిన కొడవటంచలో ఒకప్పుడు జాతర సమయంలోనే భక్తులు మొక్కులు చెల్లించుకునేవారు. కోరికలు నెరవేరడంతో జాతర సమయంలోనే కాకుండా నిత్యం స్వామి వారి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. కొత్త వాహనాలకు పూజలు చేసేందుకు కూడా భక్తులు ఆలయానికి వస్తుంటారు. ఉదయం ఐదు గంటల నుంచే స్వామి వారికి సేవా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఎక్కడాలేని విధంగా త్రికాల ఆరగింపు కేవలం కొడవటంచ ఆలయంలోనే నిర్వహించడం ప్రత్యేకత. ప్రతి నెలా స్వామి వారికి స్వాతి నక్షత్రంలో కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. నివేదన సమయంలో ఆలయ సన్నిధిలో సమానత్వానికి సూచికగా భక్తులను కూర్చోబెట్టి స్వామి వారి ప్రసాదాన్ని అందిస్తారు.
స్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తాం.
– నాయినేని సంపత్ రావు,
ఉత్సవ కమిటీ చైర్మన్
వారం రోజులపాటు జరిగే జాతరకు వచ్చే భక్తులు భక్తి శ్రద్ధలతో, ఎలాంటి వివాదాలకు దారి తీయకుండా శాంతియుతంగా జరుపుకోవాలి. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. జాతరలో అల్లర్లకు పాల్పడే ఆకతాయిలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం.
– రాజేష్, ఎస్సై, రేగొండ
●
26న (గురువారం) ఉదయం అభిషేకం, సూర్యవాహన సేవ, సాయంత్రం స్వస్తి వాచనము, శేషవాహనము సేవ (పుట్టబంగారం సేవ), అంకురారోహణం బ్రహ్మోత్సవాలు ప్రారంభం
27న (శుక్రవారం) ధ్వజరోహణం (గరుడముద్ర) కార్యక్రమాలతోపాటు అశ్వవాహన సేవ, స్వామి వారి ఎదుర్కోలు, స్వామి వారి కల్యాణం (తలంబ్రాలు)
28న (శనివారం) ఉదయం గజవాహనసేవ, రాత్రి చంద్రవాహన సేవ
01న (ఆదివారం) ఉదయం సింహవాహన సేవ, రాత్రి గరుడోత్సవం, సదస్యము
02న (సోమవారం) ఉదయం హనుమంతవాహనసేవ, రాత్రి చిన్న రథ సేవ, దోపోత్సవం
03న (మంగళవారం) హోళి పండుగ రోజున చంద్రగ్రహం ఉన్నందున ఉదయం నిత్యవిధి, హోమ, బలిహరణములు, పూర్ణాహుతి, నైవేథ్యం అనంతరం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆలయం మూసివేత
04న (బుధవారం) బోనాలు,, జాతర, సాయంత్రం పెద్ద రథోత్సవం
05న (గురువారం) ఉదయంచక్రస్నానం, జాతర రాత్రి శ్రీపుష్పయాగము
రేపటి నుంచి
కోటంచ బ్రహ్మోత్సవాలు షురూ
27న స్వామి వారి కల్యాణం
కోటివరాల కొడవటంచ
కోటివరాల కొడవటంచ


