ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌లతో కలిసి మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్, టీజీ ఎండీసీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో ఇసుక అక్రమ రవాణా నియంత్రణ, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా, కొడవటంచ దేవాలయ జాతర ఏర్పాట్లు, యూరియా కోసం రైతులు యాప్ ద్వారా బుకింగ్ చేయుట తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణాపై ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. రెవెన్యూ, పోలీస్, టీజీ ఎండీసీ శాఖలతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి పటిష్ట పర్యవేక్షణ చేపట్టాలన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తే తక్షణమే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసి రిమాండ్ చేయాలన్నారు. నియోజకవర్గ ప్రజల అవసరాలకే ఇసుక రవాణా జరగాలని, జిల్లా దాటి పోకుండా చూడాలన్నారు. నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్న కొడవటంచ దేవాలయ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య చర్యలు, తాగునీరు, మరుగుదొడ్లు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. మండలాల వారీగా ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన ఇసుకపై నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


