సమస్యల గోడు..
● ఒక్కొక్కరిది.. ఒక్కో సమస్య
● జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు
భూపాలపల్లి అర్బన్: పరిష్కారానికి నోచుకోని భూ సమస్య.. భూములకు అందని నష్టపరిహారం.. భూ నిర్వాసితులకు అందని నష్టపరిహారం.. అందని సన్నధాన్యం బోనస్ డబ్బులు.. ఇలా జిల్లా నలుమూలల నుంచి సోమవారం ప్రజావాణికి బాధితులు తరలివచ్చారు. కలెక్టర్‌కు తమ గోడును చెప్పుకుని పరిష్కారం చూపండని వేడుకున్నారు. బాధితుల సమస్యలను ఓపికగా విన్న కలెక్టర్ రాహుల్‌శర్మ పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు.
జాప్యం చేయొద్దు..
ప్రజావాణిలో వచ్చిన అన్ని దరఖాస్తులు వచ్చే ప్రజావాణి నాటికి పూర్తిగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారంలో పర్యవేక్షణ లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అన్యాయంగా పట్టా చేసుకున్నరు..
మహాముత్తారం గ్రామ శివారులోని సర్వే నంబర్ 468లో 6.17 గుంటల భూమిని సాదాబైనామా ద్వారా మార్క బాలయ్య, మార్క వెంకటేశ్వర్లు పట్టాదారులుగా చేరారు. 75 ఏళ్ల క్రితం 30కుటుంబాలు ఇళ్ల స్థలాల కోసం మార్క లచ్చయ్య వద్ద నుంచి కొనుగోలు చేశాం. ఇళ్ల స్థలాలుగా భూమి ఉండగా.. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ప్రతీ ఏడాది రైతు భరోసా, పీఎం కిసాన్ డబ్బులు తీసుకుంటున్నారు. మేము కొనుగోలు చేసినట్లు పురోక్తునామా ఉన్నది. కలెక్టర్ స్పందించి పట్టా రద్దు చేయాలి.
– బాధితులు, మహాముత్తారం
ప్రజావాణికి వినతుల వెల్లువ
సమస్యల గోడు..


