శంకుస్థాపన సరే.. పనులేవి?
చిట్యాల: చిట్యాల, టేకుమట్ల మండలాల ప్రధాన రహదారిపై మూడు చోట్ల కల్వర్టుల నిర్మాణాలకు రూ.2 కోట్లు మంజూరయ్యాయి. చిట్యాల మండలంలోని నవాబుపేట, సీఆర్‌పల్లి శివారులోని ప్రధాన రహదారిపై కల్వర్టు నిర్మాణం కోసం ఎమ్మెల్యే సత్యనారాయణరావు డిసెంబరు 2024లో శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి 14 నెలలు పూర్తయినా సంబంధిత కాంట్రాక్టరు పనులు ప్రారంభించలేదు. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాంతినగర్ సమీపంలో కల్వర్టు పక్కన తాత్కాలిక రోడ్డు కోసం పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేశాడు. ప్రతీ ఏడాది వర్షాకాలంలో గుట్టల ప్రాంతం నుంచి వర్షపునీరు వస్తుంది. భారీ వర్షాలు కురిసిన సమయంలో వాహనాల రాకపోకలు నిలిచిపోతాయి. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నిర్మాణ పనులు ప్రారంభించలేదని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కల్వర్టుల నిర్మాణం ప్రారంభించి పూర్తి చేయించాలని కోరుతున్నారు.


