సీఎం పర్యటనలతో ప్రజాధనం వృథా
ములుగు: ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్‌రెడ్డి మూడుసార్లు దేవాదుల ప్రాజెక్టును సందర్శించినా స్థానికులకు ఒరిగిందేమీలేదని, పర్యటనల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ జెడ్పీ చైర్‌పర్సన్, బీఆర్‌ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మండలాధ్యక్షుడు సానికొమ్ము రమేశ్ రెడ్డి అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నీళ్లు, నిధుల కోసమే తెలంగాణను కొట్లాడి సాధించుకున్నామన్నారు. కేసీఆర్ పోరాట ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ వచ్చిందన్నారు. రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి సీటు కేసీఆర్ పెట్టిన భిక్ష అన్నారు. తెలంగాణ రాకపోతే రేవంత్‌రెడ్డి సీఎం ఎలా అయ్యేవారని విమర్శించారు. తెలంగాణ సాధకుడైన కేసీఆర్‌ను విమర్శించే అర్హత రేవంత్‌రెడ్డికి లేదన్నారు. జిల్లాలోని గంగారం, కొత్తగూడెం మండలాలకు పాఖాలలో లిఫ్ట్ ఏర్పాటు చేసి సాగునీటిని అందించాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని మండలాలకు తుపాకుల గూడెంలోని సమ్మక్క బ్యారేజ్ నుంచి గోదావరి జలాలను కాల్వల ద్వారా సాగునీటిని అందించాలని ఆమె డిమాండ్ చేశారు. కమీషన్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6 వేల కోట్లు ఉన్న ప్రాజెక్టు అంచనాలను రూ.18,500 కోట్లకు పెంచిందని ఆరోపించారు. సమ్మక్క బ్యారేజీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు తాగు, సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు బైకాని ఓదెలు, కోగిల మహేశ్, పోరిక విజయరాం నాయక్, కుడుముల లక్ష్మినారాయణ, లకావత్ నర్సింహనాయక్, చెన్న విజయ్, ఆకుతోట చంద్రమౌళి, గోనెల భారత్, బైకని సాగర్, అనుముల సురేష్, గండి కుమార్, ముంజాల భిక్షపతి, మాచర్ల ప్రభాకర్, గొర్రె సమ్మయ్య పాల్గొన్నారు.
● బీఆర్‌ఎస్ ములుగు నియోజకవర్గ
ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి


