కొరవడిన ప్రోత్సాహం
యువతను సామాజిక చైతన్యం దిశగా నడిపించడంతోపాటు వారిలోని కళను గుర్తించి ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన యువజన సర్వీసులు, వ్యవహారాల శాఖ నిద్దరబోతోంది. ఎన్‌వైకే ఆధ్వర్యంలో యువతను ప్రోత్సహించే కార్యక్రమాలేవీ లేకపోవడంతో ఉత్సాహం నీరుగారుతోంది. పేదల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల అమల్లోనూ వీరి కృషి ఎంతో ఉండేది. గతంలో సంఘాలుగా ఏర్పడి ప్రజల మన్ననలు పొందారు. ప్రస్తుతం అలాంటివేవీ కానరావడం లేదు. వలంటీర్లను తొలగించడంతో యువజన సంఘాలన్నీ నిరుపయోగంగా మారాయి.
● యువతలోని శక్తియుక్తులను వెలికితీసి వారిని సంఘటిత పరిచి గ్రామాభివృద్ధిలో భాగస్వాములను చేయడం, తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడేలా చూడటం
● వృత్తి నైపుణ్యాలను పెంచేందుకు వృత్తి శిక్షణ శిబిరాలు నిర్వహించడం
● వ్యక్తిత్వ వికాసం పెంపొందించి సమగ్ర పౌరులుగా తీర్చిదిద్దడం
● నాయకత్వ లక్షణాలు పెంపొందించి సంఘ కార్యకలాపాలు సమర్థంగా నిర్వహించేలా చేయడం
● యువజన సంఘాలు జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగానికి, గ్రామ ప్రజల అభ్యున్నతి సాధించడంలో సమన్వయం చేయడం
● వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేలా తీర్చిదిద్దడం
భూపాలపల్లి అర్బన్: ప్రతీ గ్రామంలో దేశ నాయకుల పేరిట యువజన సంఘాల బోర్డులు గతంలో కనిపించేవి. జిల్లాలోని 12 మండలాల్లో ఒక్క యువజన సంఘం కూడా నమోదైలేదు. దీంతో క్షేత్రస్థాయిలో వీరి సేవలు ప్రస్తుతం కనిపించడం లేదు. గతంలో రక్తదానం, మొక్కల పంపిణీ, పెంపకం, పచ్చదనం, పరిశుభ్రత, గ్రామాలకు రోడ్లు వేసుకోవడం, గుంతలు పూడ్చడం, ఎయిడ్స్‌పై అవగాహన, వ్యక్తిత్వ వికాస శిబిరాలు నిర్వహించడం, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం.. తదితర కార్యక్రమాలుండేవి. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు.
మత్తుకు బానిసలుగా..
జిల్లాలోని మెజార్టీ యువకులు చెడు వ్యసనాలకు బానిస అయి మత్తులో కూరుకుపోయారు. జిల్లాలో ఇటీవల గంజాయి కేసుల్లో పట్టుబడిన వారిలో చాలామంది యువకులే కావడం ఆందోళన కలిగించే విషయం. వారిలో అంతర్లీనమైన ప్రతిభను వెలికితీసేందుకు ఎలాంటి కార్యక్రమాలూ జరగడం లేదు. అక్కడక్కడా కొందరు తలా కొంత పోగు చేసుకొని క్రీడల్లో పాల్గొంటూ బహుమతుల కోసం నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాకు ప్రత్యేకంగా ఎన్‌వైకే కార్యాలయం ఏర్పాటుతోనే మేలు కలుగుతుంది.
జిల్లాలో కనిపించని
యువజన సంఘాలు
వ్యసనాలకు బానిసలవుతున్న
యువకులు
అవగాహన కల్పించడంలో
అధికారులు విఫలం
ఇప్పటి వరకు ఒక్క సంఘం
రిజిస్ట్రేషన్ కాని పరిస్థితి
కానరాని సేవలు


