ఏఐ పాఠాలు..
డిజిటల్ పద్ధతిలో..
జిల్లాలో 5 స్కూళ్లు ఎంపిక
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పాఠాలు చెబుతున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 5 పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు కంప్యూటర్, ఏఐ పరిజ్ఞానాన్ని అలవాటు చేసేలా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 317 ప్రాథమిక, 44 ప్రాథ మికోన్నత పాఠశాలలు ఉండగా సుమారు 2 వేల మంది 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
విద్యార్థులు ఎవరిపైనా ఆధారపడకుండా..
ప్రాథమిక విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) పథకానికి 28 రకాల సాంకేతిక అంశాలను జోడించారు. 3, 4, 5వ తరగతుల విద్యార్థులను ప్రారంభ పరీక్ష ఆధారంగా ఏ, బీ, సీ గ్రూపులుగా విభజించారు. విద్యార్థులు ఎవరిపై ఆధారపడకుండా తమ స్థాయికి తగ్గట్టుగా డిజిటల్ సాధనాల ద్వారా సొంతంగా నేర్చుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. తొలి దశలో కంప్యూటర్లు, ట్యాబులు ఉన్న పాఠశాలలకు ప్రాధాన్యం కల్పించారు. ఇక చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం గతేడాది ఫిబ్రవరి నుంచి ప్రత్యేకంగా ఎక్స్‌ప్రెస్ ఎంఎల్ ప్రోగ్రాంను అమలు చేస్తున్నారు. సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేలా ప్రభుత్వ విద్యార్థులను సిద్ధం చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
ఎంపికై న పాఠశాలలు ఇవే..
భూపాలపల్లి మండలంలోని కమలాపూర్, గుర్రంపేట, కాటారం మండలంలోని కాటారం, చింతకాని, మహదేవపూర్ మండలం అంబట్‌పల్లి గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. వచ్చే విద్యా సంవత్సరం మరిన్ని పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి ఏఐ పాఠాలు నేర్పించనున్నారు.
పేద విద్యార్థులకు ప్రయోజనం
గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద విద్యార్థులకు ఏఐ పాఠాలు వరంగా మారనున్నాయి. ధనిక కుటుంబాల్లో విద్యార్థులు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. కార్పొరేట్ స్థాయిలో గ్రామీణ స్థాయిలోని ప్రాథమిక పాఠశాలల్లో ప్రభుత్వం ఏఐ ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు కంప్యూటర్, ఏఐ పరిజ్ఞానంపై అభ్యసించడం వలన భవిష్యత్‌లో ఉన్నత విద్యాభ్యాసాలకు ఉపయోగపడుతాయి.
ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగినట్లు ప్రభుత్వం ఏఐ బోధన ప్రవేశ పెట్టింది. చదువులో వెనుకబడిన పిల్లలు సాధారణ తరగతుల్లో ప్రశ్నలు అడగడానికి ఇబ్బంది పడతారు. ఎక్స్‌ప్రెస్ ఎంఎల్ వంటి డిజిటల్ సాధనాలతో వేగంగా నేర్చుకుంటున్నారు.
– పింగిలి విజయపాల్‌రెడ్డి, మానిటరింగ్ ఆఫీసర్
●
ఏఐ బోధన విద్యార్థులకు భారంగా కాకుండా ఆట పాటల మధ్య సాగుతోంది. గణితంలో ఆరోహణ, అవరోహణ క్రమాలు, పజిల్స్ పూర్తిచేయడం, వినూత్న డిజైన్ల రూపకల్పన ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతోంది. ఆంగ్లంలో మిస్సింగ్ లెటర్స్ గుర్తించడం, తెలుగులో పదాల స్పష్టమైన ఉచ్ఛరణ వంటి కృత్యాలను డిజిటల్ పద్ధతిలో నేర్పిస్తున్నారు.
ప్రాథమికస్థాయి నుంచే
సాంకేతికతపై అవగాహన
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు
ప్రయోజనం
ఏఐ పాఠాలు..


