పీహెచ్‌సీకి తాళాలు
భూపాలపల్లి రూరల్: ఆజంనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యసేవలు సక్రమంగా లేవని, వైద్యులు సమయపాలన పాటించడం లేదంటూ గ్రామస్తులు బుధవారం ఆస్పత్రికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ ఉదయం 10 గంటలు దాటినా కూడా వైద్యులు, నర్సులు, సిబ్బంది ఆస్పత్రికి హాజరుకావడం లేదని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యవసర చికిత్స కోసం వచ్చిన రోగులు గంటల తరబడి ఆస్పత్రి బయట వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు చిన్నారులతో వచ్చిన కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ఆరోగ్యకేంద్రంలో క్రమం తప్పకుండా వైద్యులు, నర్సులు హాజరు కావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు వచ్చి మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలపడంతో గ్రామస్తులు తాళం తీశారు. కాగా ఆటో బోల్తా పడిన ఘటనలో ఐదుగురి ఉపాధ్యాయులకు స్వల్ప గాయాలు కాగా వైద్యం కోసం ఆజంనగర్ ఆస్పత్రికి రాగా వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లాకేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి తరలించారు.


