రైతులను ఆర్థికంగా ప్రోత్సహించడమే ధ్యేయం
మల్హర్(మహాముత్తారం): గిరిజన ప్రాంతంలో రైతులను ఆర్థికంగా ప్రోత్సహించడమే నాబార్డు సంస్థ ధ్యేయమని తెలంగాణ రీజినల్ నాబార్డ్ జనరల్ మేనేజర్ వేణుగోపాల్ అన్నారు. బుధవారం మండలంలోని బోర్లగూడెంలో మేడారం గిరిజన రైతు ఉత్పత్తిదారుల కంపెనీ డైరెక్టర్ల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నాబార్డు సంస్థలో రైతులు ఆర్థికంగా పెట్టుబడి పెట్టి లాభం పొందాలని పిలుపునిచ్చారు. రైతులను ఆర్థికంగా నష్టపోకుండా ఈ సంస్థ ద్వారా బోర్లగూడెంలో ఫెర్టిలైజర్ షాపు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, వరి కోత మిషన్, డ్రోన్ సౌకర్యం, వ్యక్తిగత రుణాలు, మామిడి మొక్కల పెంపకం, రైతులకు పనిముట్ల సౌకర్యం, చేపల ఉత్పత్తి కేంద్రం, కూరగాయల పండించుటకు రైతులకు ఆర్థిక సహాయం పొందాలన్నారు. పెట్రోల్ పంపులను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. మేడారం గిరిజన ఎఫ్‌పీఓ దత్తత గ్రామాల్లో రైతులకు 15 బోర్లు వేసి, లింకు పైపులు ఉచితంగా అందించామన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంస్థ ద్వారా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని నాబార్డ్ జనరల్ మేనేజర్ హామీ ఇచ్చారు. అనంతరం డైరెక్టర్లు వేణుగోపాల్‌ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మధు, షార్ప్ సీఈఓ నరసింహచారి, ప్రోగ్రాం మేనేజర్ చారి, ప్రాజెక్టు మేనేజర్ వీరన్న చారి, సీఈఓ పోడం దామోదర్, షార్ప్ ఉద్యోగి మానేటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రీజినల్ జనరల్ మేనేజర్
వేణుగోపాల్


