పొత్తు పొడిచింది
కమ్యూనిస్టులతో
జతకలిసిన కాంగ్రెస్
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి పుర ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మధ్య పొత్తు కుదిరింది. బీఆర్‌ఎస్, బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగనున్నాయి. పొత్తులో భాగంగా కాంగ్రెస్ 25వార్డులు, సీపీఐ 4, సీపీఎం 1 వార్డులో పోటీ చేయనున్నాయి. బీఆర్‌ఎస్ 30 వార్డుల్లో బరిలోకి దిగింది. బీజేపీ 25 స్థానాల్లో నామినేషన్లు వేయగా.. ఐదు స్థానాల్లో నామినేషన్ వేయలేదు.
మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీని నిలువరించేందుకు ఎత్తులు వేస్తున్నాయి. ముఖ్యంగా పొత్తుల ద్వారా బీఆర్‌ఎస్ పార్టీని గండికొట్టాలని పలు పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో కాంగ్రెస్, సీపీఎంతో బీఆర్‌ఎస్ పార్టీ జతకట్టింది. నిన్న మొన్నటివరకు బీఆర్‌ఎస్, బీజేపీతో పొత్తు ఉంటుందని ఊహాగానాలు వెలువడినప్పటికీ నామినేషన్ల ప్రక్రిమ ముగియడంతో ఈ అంశానికి తెరపడింది. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీలు ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పుర ఎన్నికల్లో కూడా త్రిముఖ పోటీ నెలకొంది.
ఒంటరిగానే బీఆర్‌ఎస్, బీజేపీ
మిగతా ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు వేరే ఏ పార్టీతో కలిసే పరిస్థితి లేదు. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు ఎవరికి వారే పోటీచేయనున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ తమ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి బీ ఫామ్‌లు అందించనున్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ కూడా తన నామినేషన్లు వేసి ప్రచారం ప్రారంభించి మున్సిపల్ ఎన్నికలకు వ్యూహరచన చేస్తోంది. బీజేపీ బలహీనపడిన వాతావరణం కనిపిస్తున్న తరుణంలో ఆ స్థానాన్ని భర్తీచేసేలా బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేలా మున్సిపల్ ఎన్నికలను వాడుకోవాలనే ఆలోచనలో ఉంది. బీజేపీ పోటీచేయని వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీలు పలు గ్రామాల్లో సర్పంచ్‌ల గెలుపునకు కలిసి పనిచేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం మెజారిటీ సీట్ల సంఖ్య ఏ మాత్రం తక్కువైనా గతంలో లాగే ఎన్నికల అనంతరం బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల పొత్తుకుదిరే అవకాశం ఉండకపోలేదని పుర ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
కుదిరిన సీట్ల లెక్క
కాంగ్రెస్‌తో జతకట్టిన సీపీఐ, సీపీఎంలకు సీట్ల కేటాయింపు లెక్క తేలింది. మున్సిపాలిటీలో 30 వార్డు వార్డులు ఉండగా 25వార్డులు కాంగ్రెస్, 4 సీపీఐ, 1 సీపీఎం పోటీచేయనుంది. 5, 7, 24, 28 వార్డులో సీపీఐ, 27వ వార్డులో సీపీఎం అభ్యర్థులు నామినేషన్ వేశారు. బీఆర్‌ఎస్ 30 వార్డుల్లో నామినేషన్ వేయగా బీజేపీ తరఫున 25 వార్డుల్లో అభ్యర్థులు నామినేషన్ వేశారు. 8, 18, 25, 26, 30 వార్డుల్లో పార్టీ తరఫున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
ఎన్నికల షెడ్యూల్‌కు ముందు అన్ని పార్టీల నాయకులు వేర్వేరుగా ప్రచారాన్ని ప్రారంభించారు. పొత్తుల విషయంలో కూడా అన్ని పార్టీల కన్నా ముందుగా వ్యూహాత్మకంగా లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్‌కు పొత్తు కుదిరింది. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో కలిసొచ్చే అంశంగా ఆయా పార్టీలు భావిస్తున్నారు. పట్టణంలోని ఓటర్లలో సింగరేణి కార్మికులు అధికంగా ఉండటం, గతంలో జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలుపొందడం కూటమికి సానుకూలాంశంగా మారింది. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో ఏఐటీయూసీ కార్మికసంఘం బలంగా ఉండటం కూటమికి కలిసొచ్చే అంశంగా పార్టీలు భావిస్తున్నాయి.
మున్సిపల్‌లో సీపీఐ, సీపీఎంతో
జతకట్టిన కాంగ్రెస్
ఒంటరిగా బరిలోకి బీఆర్‌ఎస్, బీజేపీ
పొత్తు పొడిచింది
పొత్తు పొడిచింది


