భక్తుల కోలాహలం
మంగపేట/వెంకటాపురం(ఎం): మేడారంలోని వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించిన అనంతరం హేమాచలక్షేత్రం, రామప్ప ఆలయానికి తరలివచ్చి లక్ష్మీనర్సింహస్వామి, రామలింగేశ్వస్వామిని దర్శించుకుంటున్నారు. ఈ మేరకు ఆదివారం మంగపేట మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో కోలాహలంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పవన్‌కుమార్, శేఖర్‌శర్మ భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. మేడారం భక్తులు తిరుగు ప్రయాణంలో రామప్పను సందర్శిస్తుండడంతో పాటు అదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. రామప్ప ఆలయ గార్డెన్‌లో భక్తులు సేదతీరి ఉల్లాసంగా గడిపారు. ఏసీబీ తెలంగాణ ఐజీ తరుణ్ జోషి కుటుంబసమేతంగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.
మేడారం నుంచి హేమాచల క్షేత్రం,
రామప్పకు తరలివస్తున్న సందర్శకులు


