చదువులు సాగేదెలా!
జిల్లాలో పాఠశాలల వివరాలు
ప్రారంభం నుంచి అడ్డంకులే..
ఇప్పటికే పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులు
భూపాలపల్లి అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్), పాఠశాలల తనిఖీ బృందాల్లో ఉపాధ్యాయులు కొన్ని రోజులుగా పాఠశాలలకు దూరంగా ఉండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు ముందుకు సాగడంలేదు. ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు టెట్ పరీక్ష ఉండడంతో ఉపాధ్యాయులు తీరికలేకుండా ఉన్న తరుణంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనూ ఉపాధ్యాయులకు శిక్షణ, ఎన్నికల విధులు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లాలో 69 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 2,739 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. పదోతరగతి విద్యార్థులకు జనవరిలోగా సిలబస్ పూర్తిచేసి రివిజన్(పునఃశ్చరణ) తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. ఉదయం, సాయంత్రం, వేళల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఉంటాయి. పరీక్షల్లో అవగాహన పెంచుకునేందుకు రోజువా రీగా స్లిప్ టెస్ట్‌తో పాటు వెనుకబడిన విద్యార్థులకు పాఠ్యాంశాలపై అవగాహన కల్పించాలి. కాని వరుసగా వస్తున్న ఎన్నికలు నాయకులకు, అభ్యర్థులకే కాకుండా విద్యార్థులకూ ఓ పరీక్షలా తయారయ్యా యి. ఇటు ఎన్నికల శిక్షణ, అటు టెట్ పరీక్షలకు సంసిద్ధం కావాల్సి ఉండడంతో ఉపాధ్యాయులు కఠిన పరీక్షను ఎదుర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎన్నో తంటాలు పడుతున్న ఉపాధ్యాయులకు ఎన్నికలు రావడం మరింత ఇబ్బందిగా తయారైంది. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి వార్షిక పరీక్షలకు ప్రణాళికలతో సన్నద్ధం చేయాల్సిన సమయంలో ఎన్నికలు రావడం ఫలితాలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు.
పరీక్షల వేళ తనిఖీ బృందాలా?
పరీక్షల సమయం దగ్గర పడుతున్న వేళ జిల్లాలో పాఠశాలల తనిఖీకి ప్రభుత్వం ఉపాధ్యాయులతో కూడిన బృందాలను ఏర్పాటు చేసింది. పాఠశాలలకు వెళ్లకుండా పూర్తి డిప్యూటేషన్‌పై ఈ బృందాలు ప్రతీ రోజు పాఠశాలల తనిఖీ చేయాల్సి ఉంటుంది. ప్రాథమిక స్థాయి బృందాలు రోజుకు రెండు, ప్రామికోన్నత, ఉన్నత పాఠశాలలు రోజుకు ఒక పాఠశాలను తనిఖీ చేస్తున్నారు. తనిఖీల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల నమోదు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, తరగతి విద్యా బోధన, ఎఫ్‌ఎల్‌ఎన్, లీప్ కార్యక్రమాల అమలు తీరు, ఇతర వినూత్న కార్యక్రమాల అమలు తీరును పరిశీలిస్తున్నారు. తనిఖీ బృందం వచ్చే వరకు పాఠశాలలో ఉపాధ్యాయులు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో ఉపాధ్యాయులు నిమగ్నమవుతున్నారు. దీంతో పాఠశాలల్లో విద్యాబోధన స్తంభించింది.
ఆ తర్వాత టెట్ ప్రిపరేషన్
త్వరలో మున్సిపల్ ఎన్నికల శిక్షణ, విధులు
ప్రభుత్వ పాఠశాలల్లో
బోధనకు ఆటంకాలు
‘పది’ ఫలితాలపై ప్రభావం
విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి విద్యాబోధనకు ఆటంకం కలుగుతోంది. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ నిర్వహించారు. దీంతో విద్యాబోధనకు అవాంతరాలు ఎదురయ్యాయి. అనంతరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, దసరా సెలవులు రావడంతో బోధన అంతంత మాత్రంగానే సాగింది. అంతలోనే మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అందులోనూ ఉపాధ్యాయులకే విధులు కేటాయించారు. తర్వాత సంక్రాంతి సెలవులు రావడంతో ఇలా పలు కారణాలతో చదువులు సాగలేదు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు వస్తుండడంతో విద్యార్థులు ఆందోళనకు గురువుతున్నారు. పదో తరగతి విద్యార్థులకు మార్చి 14 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పాఠశాలల్లో చదువులు సరిగా సాగక విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతారో అన్న భయందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. ఎన్నికల ప్రభావంతో ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది.


