కంప్యూటర్ విద్యపై దృష్టి సారించాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్‌బాబు
భూపాలపల్లి అర్బన్: మారుతున్న ఆధునిక సమాజంలో బాలికలకు కంప్యూటర్ విద్య అనివార్యమని.. దృష్టి సారించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సీహెచ్ రమేశ్‌బాబు అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జంగేడు కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. నేటి విద్యార్థులను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న సమస్య సెల్‌ఫోన్ అడిక్షన్ అని, అవసరానికి మించి ఫోన్ వాడకూడదని సూచించారు. ప్రతీ విద్యార్థినిలో ప్రత్యేక ప్రతిభ ఉంటుందని, స్వీయ క్రమశిక్షణతో దాన్ని వెలికితీసుకొని ముందుకు సాగాలని అన్నారు. విద్యార్థినులు ఎటువంటి సమస్యలు ఎదురైనా భయపడకుండా జిల్లా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. సంస్థ విద్యార్థినులకు పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ రావు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పుప్పాల శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అక్షయ, జెండర్ ఈక్విటీ కోఆర్డినేటర్ శైలజ, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ ఈశ్వరి, ఎస్సై రవళి పాల్గొన్నారు.


