మున్సి‘పోల్’కు అంతా సిద్ధం
భూపాలపల్లి: ఎన్నికల నిర్వహణకు అధికారులు భూపాలపల్లి మున్సిపాలిటీలో సిద్ధంగా ఉన్నారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేయడంతో పాటు సరిపడా బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బందిని ఎంపిక చేయగా, త్వరలోనే వారికి శిక్షణ అందించనున్నారు.
86 పోలింగ్ కేంద్రాలు..
భూపాలపల్లి మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా పురుష ఓటర్లు 26,786, మహిళా ఓటర్లు 25,936, ఇతరులు నలుగురు.. మొత్తంగా 52,726 మంది ఓటర్లు ఉన్నారు. 30 వార్డులకు గాను 86 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఓటర్ల సౌకర్యార్థం తక్కువ ఓటర్లు ఉన్న వార్డుల్లో రెండు, ఎక్కువ ఉన్న చోట మూడు కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. 204 బ్యాలెట్ బాక్సులు అవసరం ఉండగా మరో 90 బాక్సులను అదనంగా సిద్ధంగా ఉంచారు.
14 మంది నోడల్ ఆఫీసర్ల నియామకం..
మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 14 మంది నోడల్ అధికారులను నియమించారు. జోనల్ ఆఫీసర్లుగా ఆరుగురు, రిటర్నింగ్ ఆఫీసర్లుగా 12, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా 12 మంది, పీఓలు 102, ఓపీఓలు 306 మంది, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, స్టాటిటిక్స్ సర్వేలెన్స్ టీంలు 4, ఎంసీసీ టీంలు రెండు, ఎక్స్‌పెండేచర్ అబ్జర్వర్‌గా ఒక టీంతో పాటు పోలీసు సిబ్బంది 150 మంది విధులు నిర్వర్తించనున్నారు. 86 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయనుండగా, 27 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వర్తించనున్నారు.
సమస్యాత్మక కేంద్రాలు 19..
మున్సిపాలిటీలో 86 పోలింగ్ కేంద్రాలు ఉండగా సున్నితమైనవి 23 ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. గతంలో చిన్నచిన్న అల్లర్లు జరిగిన, పార్టీల నాయకుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని భావించే 19 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోనున్నారు.
కమ్యూనిటీ హాల్‌లో కౌంటింగ్
ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ ప్రక్రియను క్రిష్ణాకాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించనున్నారు.
వార్డులు 30, పోలింగ్ స్టేషన్లు 86, ఓటర్లు 52,726
మున్సిపాలిటీ కార్యాలయంలో
నామినేషన్ల స్వీకరణ
కౌంటింగ్ కేంద్రం..
క్రిష్ణాకాలనీ కమ్యూనిటీ హాల్
ఏర్పాట్లు పూర్తిచేస్తున్న మున్సిపల్ అధికారులు
మున్సి‘పోల్’కు అంతా సిద్ధం


