‘మేడారం’ ప్రయాణం దూరమే!
కాళేశ్వరం: మేడిగడ్డ బరాజ్ మీదుగా వాహనాలు రాకపోకలు నిలిపివేయడంతో తెలంగాణ కుంభమేళా మేడారానికి వచ్చే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ భక్తులు ఇబ్బందులు పడనున్నారు. కనీసం 40 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేసి కాళేశ్వరం వద్ద అంతర్రాష్ట్ర వంతెన దాటి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. భక్తులకు రవాణా కష్టాలు.. దూరభారం పెరగడం తప్పేలా లేదు. మేడారం జాతరం ఈనెల 28 నుంచి 31 వరకు జరుగనున్న నేపథ్యంలో వారం రోజుల పాటు భక్తుల సౌకర్యార్థం లైట్ మోటార్ వాహనాలు, టూవీలర్స్‌కు అనుమతివ్వాలని భక్తులు కోరుతున్నారు.
ఎన్‌డీఎస్‌ఏ సూచనలతో..
మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌లో 2023 అక్టోబర్ 21న 7వ బ్లాక్‌లోని 20వ పిల్లర్ కుంగిపోవడంతో రాకపోకలను ఎన్‌డీఎస్‌ఏ సూచనలతో ఇంజనీరింగ్ అధికారులు నిలపేశారు. అప్పటి నుంచి బరాజ్ భద్రత ప్రమాణాల నేపథ్యంలో రాకపోకలను కట్టడి చేశారు. కొన్ని రోజుల పాటు టూ, ఫోర్ వీలర్స్ అనుమతి ఇచ్చినప్పటికీ ఆ తరువాత ఇరిగేషన్, పోలీసుశాఖలు నిలిపివేశాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని భక్తులు గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదులపై నిర్మించిన వంతెనల గుండా ప్రతి జాతరకు మేడారం తరలి వస్తుంటారు. ప్రస్తుతం రాకపోకలకు అనుమతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
మేడిగడ్డ బరాజ్ మీదుగా
అనుమతి లేక ఇబ్బందులు
అనుమతిస్తే మహారాష్ట్ర,
ఛత్తీస్‌గఢ్ భక్తులకు మేలు
వారం పాటు అనుమతివ్వాలని వేడుకోలు


