ఊరూరా మొక్కులు | - | Sakshi
Sakshi News home page

ఊరూరా మొక్కులు

Jan 24 2026 7:25 AM | Updated on Jan 24 2026 7:25 AM

ఊరూరా మొక్కులు

ఊరూరా మొక్కులు

రెండేళ్లకొకసారి సమ్మక్క–సారలమ్మ జాతర

కాళేశ్వరం: రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు ముందుగా గ్రామాల్లో మొక్కుల సందడి నెలకొంది. వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించే ఆనవాయితీతో ఊరూరా ఉత్సవ వాతావరణం కనిపిస్తోంది. కుటుంబసమేతంగా భక్తులు కొత్త దుస్తులు ధరించి కిరాణా దుకాణాల వద్దకు చేరుకొని తూకాలతో బెల్లాన్ని కొని మొక్కులు చెల్లిస్తున్నారు. డప్పు చప్పుళ్లు, మంగళహారతుల మధ్య బెల్లం బుట్టలను తలపై మోసుకుని భక్తులు ఇంటికి చేరి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తున్నారు. అనంతరం ప్రసాదంగా బంధువులు, పొరుగువారికి పంపిణీ చేస్తున్నారు. పిల్లల పెళ్లిళ్లు, సంతానం, ఆరోగ్యం, ఉద్యోగాలు, ఇళ్ల నిర్మాణం, వ్యాపార వృద్ధి వంటి కోర్కెలు తీరిన భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లిస్తున్నారు. ఈనెల 28 నుంచి 31 వరకు ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఉన్నందున ఇంటి వద్ద భక్తులు ముందుగా మొక్కులు చెల్లిస్తున్నారు.

పెరిగిన ధరలు..

మేడారం జాతర నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బెల్లం విక్రయాలకు డిమాండ్‌ భారీగా పెరిగింది. కిలో బెల్లం ధర రూ.50–60 వరకు పలుకుతోంది. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు పెద్దఎత్తున బెల్లం నిల్వలు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో కొందరు గుడుంబా తయారీదారులు కూడా బెల్లం విక్రయాలపై దృష్టిసారిస్తున్నట్లు తెలిసింది. సంబంధిత అధికారులు అటు వైపు చూడాల్సిన అవసరం ఉంది.

కొబ్బరికాయలకు డిమాండ్‌..

జాతర ముందస్తు మొక్కుల కారణంగా కొబ్బరికాయలకు డిమాండ్‌ పెరిగింది. జిల్లావ్యాప్తంగా ఒక్కో కొబ్బరికాయ ధర రూ.35–50 వరకు చేరింది. సంక్రాంతి కారణంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి సరఫరా నిలిచిపోవడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

మేకలు, కోళ్లకు భారీ డిమాండ్‌

జాతర సందర్భంగా మేకలు, కోళ్లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. స్థానిక మేకలు సరిపోక రాజస్థాన్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. మామూలు సమయంలో 10వేల లోపు దొరికే మేకలు ప్రస్తుతం ఐదు నుంచి ఎనిమిది కిలోలు ఉండే ఒక మేక ధర రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పలుకుతోంది. కోళ్ల ధరలు కూడా అమాతం పెరిగాయి. బాయిలర్‌ కోడి కిలో రూ.220, జుట్టు కోడి రూ.220, నాటు కోడి కిలో రూ.600 వరకు విక్రయిస్తున్నారు.

అధిక ధరలకు మద్యం..

జాతర వేళ బంధువులు, సన్నిహితులను పిలుచుకుని విందులు ఏర్పాటు చేయడంతో మద్యం దుకాణాలు కూడా కిటకిటలాడుతున్నాయి. బెల్టు దుకాణాలకు మరో దసరా, సంక్రాంతి, కొత్త సంవత్సరం సీజన్‌లు ఒకేసారి కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. కిరాణా దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. జాతరకు వారం రోజుల ముందే గ్రామాల్లో కోలాహలం మొదలవడంతో మేడారం జాతర సందడితో గ్రామాల్లో జోష్‌ నింపుతోంది.

పెరిగిన బెల్లం, కొబ్బరికాయలు,

మేకలు, మద్యం ధరలు

కిటకిటలాడుతున్న కిరాణా దుకాణాలు

పట్టణాలు, గ్రామాల్లో

సమ్మక్క భక్తుల రద్దీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement