రాకపోకలకు అంతరాయం కలగొద్దు
భూపాలపల్లి: మేడారం జాతర సందర్భంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. తాడ్వాయి మండలం నార్లాపూర్ నుంచి భూపాలపల్లి, నార్లాపూర్ నుంచి మహాముత్తారం మండలం కాల్వపల్లి మీదుగా కాటారం వరకు ఎగ్జిట్ అయ్యే మార్గాన్ని ఎస్పీ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా స్టేషన్ల పరిధిలోని పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. మేడారం జాతర నేపథ్యంలో వన్ వే ఉంటుందని, జాతరకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రతీ వాహనం భూపాలపల్లి మీదుగా వెళ్తుందన్నారు. జాతర నుంచి తిరిగి వచ్చే వాహనాలు సాఫీగా, ఆటంకాలు లేకుండా ప్రయాణించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. మేడారం నుంచి నార్లాపూర్ మీదుగా భూపాలపల్లికి వచ్చే మార్గంలో మలుపులు అధికంగా ఉన్నందున వాహనదారులు అత్యంత జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు. జాతర సమయంలో పశువులను రోడ్లపైకి రాకుండా చూడాలని, వాటి వలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. జాతర సందర్భంగా రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ప్రమాదాల నివారణకు భక్తులు, వాహనదారులు పోలీసు సిబ్బందికి సహకరించాలని ఎస్పీ సంకీర్త్ కోరారు.
శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం
రేగొండ: శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా విధులు నిర్వహించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. కొత్తపల్లిగోరి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణం, పరిసరాల శుభ్రత, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారితో స్నేహపూర్వకంగా ఉండటంతో పాటు, త్వరితగతిన కేసులు పరిష్కారమయ్యే విధంగా పోలీసు సిబ్బంది సేవలందించాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ సంపత్‌రావు, రేగొండ ఎస్సై రాజేష్ ఉన్నారు.
మేడారం జాతర సందర్భంగా
ముందస్తు చర్యలు
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


