రవాణాపరంగా ఇబ్బందులు రావొద్దు
భూపాలపల్లి: మేడారం జాతరకు వెళ్లి వచ్చే భక్తులకు రవాణాపరంగా ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కాటారం నుంచి మహా ముత్తారం వరకు, భూపాలపల్లి నుంచి గొల్లబుద్ధారం వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారుల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారుల మరమ్మతులు, గుంతల పూడ్చివేత, రోడ్డు వెడల్పు, సైన్‌బోర్డుల ఏర్పాటు, వీధి దీపాల నిర్వహణ వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కమలాపూర్‌లో జరుగనున్న మినీ మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు అవసరమైన తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని, భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతర సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వాహనాల రవాణా నియంత్రణ, ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేయాలని చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ, రెవెన్యూశాఖ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


