కోటీశ్వరులను చేయాలన్నదే లక్ష్యం
భూపాలపల్లి రూరల్: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకుపోతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలో రూ.2 కోట్లతో రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ, సర్పంచ్‌ల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మార్చి నెలాఖరు వరకు ప్రతీ ఒక్క మహిళకు చీర అందిస్తామన్నారు. 560 మంది మహిళలకు మేడారంలో దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించామని తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీలో రూ.63 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ శిక్షణలో ఇచ్చిన అంశాలపై పూర్తి అవగాహన కలిగి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో సమగ్ర పాత్ర పోషించాలని సూచించారు. గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. సమావేశంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి, ఎస్పీ సంకీర్త్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, డీపీఓ శ్రీలత, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క


