మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం
● కలెక్టర్ రాహుల్‌శర్మ
భూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మున్సిపల్ ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహణకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జోనా తదితరులు పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవానికి
ఏర్పాట్లు చేయాలి
జిల్లాలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంబేడ్కర్ క్రీడా మైదానంలో జరగనున్న గణతంత్ర వేడుకలకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖల స్టాళ్లు, విద్యార్థులచే సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, అధికారులు పాల్గొన్నారు.


