నత్తనడకన ..
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల వివరాలు
చేతులెత్తేస్తున్న కమిటీలు
జిల్లాలో నెమ్మదించిన
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
చిట్యాల మండలం భావుసింగ్‌పల్లి బేస్‌మెంట్ లెవల్‌లో నిలిచిన ఇల్లు
భూపాలపల్లి అర్బన్: అర్హులైన నిరుపేదలకు సొంతింటిని నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే మొదటి విడతలో జిల్లాలో 3,943 ఇళ్లను మంజూరు చేసింది. కలెక్టర్ అన్ని ఇళ్లకు ఆమోదం తెలిపారు. దీంతో 3,178 ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. మిగతా 765 ఇళ్ల నిర్మాణ పనులు వివిధ కారణాలతో ప్రారంభించలేదు. ఆరు మాసాలు గడిచిపోతున్నా ఇప్పటి వరకు 27 ఇళ్లు మాత్రమే పూర్తయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు, సెంటిమెంట్ నమ్మకాలతో ఇళ్ల నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ఇలాంటి పరిస్థితులే చాలా గ్రా మాల్లో ఎదురవుతున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో పనులు ప్రారంభించని లబ్ధిదారుల నుంచి ఒప్పంద పత్రాలను రాయించుకుంటూ రద్దు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ నెల నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే సాంకేతిక ఇబ్బందులతో బిల్లుల కోసం లబ్ధిదారులు అధికా రుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కొన్ని సమస్యలను జిల్లాలోనే పరిష్కరిస్తున్నా.. చాలా సమస్యలు రాష్ట్ర స్థాయి అధికారుల పరిధిలో ఉండడంతో ఏమి చేయలేని పరిస్థితి ఉందని జిల్లా అధికారులు చేతులెత్తేసున్నారు. ఇలాంటి పరిస్థితులతో ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యం నెరవేరడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆకాశాన్ని అంటుతున్న ధరలు
నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్ని అంటడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా ఇసుక, ఇటుక, సిమెంట్ ధరలు భారీగా పెరిగి పోవడంతో లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీటికి తోడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. సకాలంలో పనులను పూర్తి చేయాలని చెప్పినా లబ్ధిదారులు పట్టించుకోవడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. లబ్ధిదారుల మూఢ విశ్వాసాలతో ఇందిరమ్మ పథకానికి ఇబ్బందులు తప్పడం లేదు.
జిల్లాలో కొంతమంది లబ్ధిదారులు నిర్మాణ పనులు ఆలస్యంగా ప్రారంభించారు. నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశాం. ని ధులకు ఎటువంటి ఇబ్బంది లేదు. నిర్మాణాలకు అనుగుణంగా బిల్లులు మంజూరు చేస్తున్నాం.
– లాల్, గృహ నిర్మాణ శాఖ పీడీ
మంజూరైన ఇళ్లు 3,943
పనులు ప్రారంభమైనవి 3,178
బేస్‌మెంట్ లెవల్‌లో ఉన్నవి 1,891
లెంటల్ లెవల్‌లో ఉన్నవి 792
స్లాబ్ లెవల్‌లో ఉన్నవి 762
నిర్మాణం పూర్తయిన ఇళ్లు 27
ఇంతవరకు ప్రారంభం కాని ఇళ్లు 765
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అధికారులు, లబ్ధిదారుల మధ్య సమన్వయం చేసేందుకు ప్రభుత్వం గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యుల అనుమతితోనే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోంది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపాల్సిన కమిటీ సభ్యులు పత్తాలేకుండా పోయారన్న ఆరోపణలు వస్తున్నాయి. చాలా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కువగా అధికార పార్టీకి చెందిన కార్యకర్తలే ఇందిరమ్మ కమిటీల్లో సభ్యులుగా ఉండడంతో అధికారులు అడిగేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగవంతమయ్యేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
ఇప్పటి వరకు 27 గృహాలే పూర్తి
మహిళా సంఘాల సభ్యులకు
అందని ఆర్థికసాయం
గ్రామాల్లో పత్తాలేని కమిటీలు
క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించని అధికార యంత్రాంగం


