వేట షురూ | - | Sakshi
Sakshi News home page

వేట షురూ

Jan 21 2026 7:05 AM | Updated on Jan 21 2026 7:05 AM

వేట ష

వేట షురూ

వేట షురూ గెలుపు గుర్రాల

ముమ్మరంగా అధికార, ప్రతిపక్ష పార్టీల సర్వేలు

మున్సిపాలిటీలో మొదలైన ఎన్నికల వేడి

భూపాలపల్లి: కోడ్‌ కూయకముందే భూపాలపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీలు ఓ వైపు తమ వ్యూహాలకు పదును పెడు తూ, మరోవైపు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు సర్వేల బాట పట్టాయి. వార్డుల్లో పార్టీ పరిస్థితి, ఎవరికి అవకాశం ఇస్తే గెలిచి వస్తారనే అంశాలపై అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నా యి. సర్వే రిపోర్ట్‌ ఆధారంగానే గెలుపు గుర్రాలను ఎంచుకునేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.

ఓటర్ల నాడీ పట్టుకునేందుకు..

భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. ఆయా వార్డుల్లో ఓటర్ల నాడి పట్టుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాయి. గత ఎన్నికల ఫలితాలు, ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాలను బట్టి, ఏ వార్డులో ఏ పార్టీకి పట్టుందనే విషయమై ఆరా తీస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా చేరిన ఓటర్లు, యువత ఎటువైపు మొగ్గు చూపుతున్నారనేది సర్వేలో ప్రధానాంశంగా మారింది. గతంలో కొన్ని వార్డులు ఒక పార్టీకి మాత్రమే కంచుకోటలుగా ఉండగా, మరికొన్ని వార్డుల్లో స్వల్ప తేడాతో గెలుపోటములు మారే అవకాశం ఉందని సర్వేలో తెలుస్తోంది.

అభ్యర్థి ఎంపికే గెలుపు మంత్రం..

ఎవరికి టికెట్‌ ఇస్తే గెలుస్తారనేది ఇప్పుడు అధిష్టానాలకు పెద్ద సవాల్‌గా మారింది. కేవలం పార్టీ విధేయత మాత్రమే కాకుండా, వ్యక్తిగత ఇమేజ్‌, ఆర్థిక బలం, స్థానికంగా ఉన్న సామాజిక సమీకరణాలు గెలుపును శాసిస్తాయని పార్టీల నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని ధీటుగా ఎదుర్కొనే వారికే ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నారు. కాగా భూపాలపల్లి మున్సిపాలిటీలో పార్టీ కోసం పని చేసిన నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కొత్తగా వచ్చి ప్రజల్లో క్రేజ్‌ ఉన్న నాయకుల మధ్య టికెట్ల పోటీ నెలకొంది.

పిలిస్తే వచ్చే వారై ఉండాలి..

వార్డుల్లో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకులపై సర్వే బృందాలు ప్రత్యేకంగా డేటా సేకరిస్తున్నాయి. వార్డులోని సమస్యల పరిష్కారంలో చొరవ చూపిన, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన వారికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్నట్లు సర్వేల్లో తెలుస్తోంది. కౌన్సిలర్‌గా బరిలో నిలిచే వారు తమవారై ఉండాలి.. సమస్య వచ్చినప్పుడు వెంటనే పరిష్కార మార్గం చూపే వారై ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.

అభ్యర్థుల ఎంపిక కోసం

ప్రధాన పార్టీల సర్వే

వార్డుల్లో తమ పార్టీ బలం ఎంత..?

ప్రజాభిమానం చూరగొన్నది ఎవరు?

రంగంలోకి ప్రత్యేక బృందాలు

మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీలు బలంగా ఉండగా, ఈ రెండు పార్టీలు వార్డుల్లోని ప్రజల ద్వారా గెలుపు గుర్రాలు ఎవరనే విషయం తెలుసుకోవడంతో పాటు అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న ఊపుతో క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతను అంచనా వేస్తుండగా, బీఆర్‌ఎస్‌ పార్టీ గతంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తోంది. బీజేపీ బలమైన అభ్యర్థుల కోసం ఇంకా వేట సాగిస్తోంది. ఏది ఏమైనప్పటికీ అంతర్గత సర్వేలు, వార్డుల్లో ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగానే పార్టీలు కౌన్సిలర్‌ అభ్యర్థులను ఎంపిక చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

వేట షురూ 1
1/1

వేట షురూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement