పైసలుంటేనే పోటీ
డబ్బు సమకూర్చుకునే పనిలో ఆశావహులు
మున్సిపల్ బరిలో ఉండాలంటే ఖర్చు పెట్టాల్సిందే..
భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ వార్డుల వారి ఓటర్లకు సంబంధించిన తుదిజాబితా విడుదల కావడం, రిజర్వేషన్ల ప్రకటన కూడా పూర్తి కావడంతో పార్టీలు పోరుకు సిద్ధమవుతున్నాయి. బరిలో ఉండాలనుకుంటున్న ఆశావహులు లెక్కలేసుకుంటున్నారు. మొన్నటి పంచాయతీ ఎన్నికలను కూడా ధన రాజకీయాలే ప్రభావితం చేశాయి. భూపాలపల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా గెలవాలన్నా డబ్బులు ఖర్చుపెట్టే నాయకులను బరిలో దింపే ఆలోచనల్లో పలు పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని పార్టీలు కూడా ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులవైపే మొగ్గుచూపించే వాతావరణం కనిపిస్తోంది.
ఆర్థికంగా ఉంటేనే అభ్యర్థిత్వం
అన్ని పార్టీలు ఆర్థికంగా కాస్త ఉన్నవారినే పురపోరులో బరిలో దింపాలని చూస్తున్నాయి. అన్ని పార్టీలు పార్టీ ఫండ్‌తో పాటు ఎన్నికల్లో స్వయంగా ఖర్చు చేసే నేతల వైపే చూస్తున్నాయి. అన్ని పార్టీలతో పోలిస్తే అర్ధబలం, అంగబలంలో బీఆర్‌ఎస్ అందరి కన్నా మెరుగ్గా ఉంది. బీఆర్‌ఎస్ ధీటుగా ఎదగాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఏదేమైనా ఈసారి మున్సిపాలిటీపై అధికార కాంగ్రెస్ జెండా ఎగరాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. ఎన్నికల ఖర్చులో కూడా రెండు పార్టీలు ఏమాత్రమూ తగ్గకుండా నిధుల సమీకరణ ఉండనుందని తెలిసింది. అభ్యర్థుల్ని తట్టుకోవాలంటే పార్టీ ఇచ్చే నిధులతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్న వారినే బరిలో నిలపాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఇతర పార్టీలు భావిస్తున్నాయి.
ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. పోటీచేయాలని భావిస్తున్న వారు డబ్బు సమకూర్చుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలో వచ్చే అవకాశం ఉండటంతో ఖర్చుల కోసం డబ్బులను ఈలోపే సర్ధుబాటు చేసుకోవాలని అనుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి ఖర్చు తడిసి మోపైడెంది. కనీసం 500 మంది ఓటర్లు లేని పంచాయతీల్లో కూడా అభ్యర్థుల ఖర్చు రూ.5 లక్షలు దాటింది. ఈ లెక్కన మున్సిపల్ ఎన్నికలు మరింత కాస్లీగా ఉండనున్నాయి. ఒక్కో వార్డులో సగటున 2,200 జనాభా ఉంటే కనీసం 1500 పైగా ఓటర్ల ఉండే అవకాశం ఉంది. దీంతో మెజారిటీ వార్డుల్లో పోటీలో ఉండే ఒక్కో అభ్యర్థికి సుమారుగా రూ.20 లక్షల కన్నా ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఉంది.
డబ్బు సర్దుబాటు చేసుకుంటున్న ఆశావహులు
ఆర్థికంగా ఉన్న అభ్యర్థుల వైపే పార్టీల మొగ్గు
పైసలుంటేనే పోటీ
పైసలుంటేనే పోటీ


