అనుమతి లేని ఆస్పత్రులపై చర్యలు
భూపాలపల్లి: జిల్లాలో అనుమతులు లేకుండా ప్రైవేటు ఆస్పత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్, రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాల్లో అనుమతులు లేకుండా ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లు నిర్వహించరాదన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే ఆస్పత్రులు ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మించాలని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తేనే అనుమతులు ఇవ్వాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) మార్గదర్శకాల ప్రకారం బయో మెడికల్ వేస్ట్ చార్జీలను ఆస్పత్రుల వద్ద తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వైద్యసేవల నిమిత్తం ఆస్పత్రులు, క్లినిక్‌లకు వచ్చే రోగులకు రాసే చీటీలో కాంపోజిషన్‌తో పాటు మందుల వివరాలు అర్థమయ్యేలా రాయాలన్నారు. వైద్యసేవల రుసుము తెలిసేలా చార్జీల పట్టిక ప్రదర్శించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్‌కుమార్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్, ఐఎంఏ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ కేఎస్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ మహిళకు చీర అందించాలి..
మహిళా సంఘాల్లో సభ్యులుగా లేని మహిళలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. పురపాలక సంఘాల్లో మహిళలకు వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ చీరెల పంపిణీ అంశాలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, రాష్ట్రస్థాయి అధికారులు పాల్గొన్నారు. భూపాలపల్లి ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్ మాట్లాడారు. ఇందిరమ్మ చీరల పంపిణి కార్యక్రమానికి సంబంధించి భూపాలపల్లి మున్సిపాలిటీకి ఆర్డీఓ హరికృష్ణను ప్రత్యేక అధికారిగా నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్వయం సహాయక సంఘాలలో సభ్యులు కాని మహిళలకు చీరల పంపిణీకి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్‌డీఓ బాలక్రిష్ణ, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత ఉద్యోగ శిక్షణ కరపత్రం ఆవిష్కరణ..
టీజీఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచితంగా అందించనున్న ఉద్యోగ శిక్షణ కరపత్రాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ఆవిష్కరించారు.
తక్షణ చర్యలు తీసుకోవాలి..
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 27 దరఖాస్తులు స్వీకరించి, దరఖాస్తులను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్‌మెంట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రతీ మహిళకు
ఇందిరమ్మ చీర అందించాలి
కలెక్టర్ రాహుల్ శర్మ


