మౌని అమావాస్య.. భక్తుల పూజలు
కాళేశ్వరం: మౌని అమావాస్య సందర్భంగా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరిలో ఆదివారం భక్తులు ప్రత్యేకంగా పుణ్యస్నానాలు చేశారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. గ్రామంలోని శ్రీచంద్రశేఖరస్వామి ఆలయంలో శివలింగాన్ని భక్తులు ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. సాయంత్రం వీఐపీఘాటు వద్ద గోదావరికి నిత్య హారతి కార్యక్రమాన్ని దేవస్థానం అర్చకులు నిర్వహించారు. దీంతో భక్తుల సందడి నెలకొంది.
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మండలం కమలాపూర్ నుంచి రాంపూర్ గ్రామాల మధ్య అడవిలో 11 కేవీ స్తంభం ప్రమాదకరంగా ఉంది. వారం రోజులుగా విద్యుత్ స్తంభం వంగి రోడ్డు పక్కన చేతికి అందే ఎత్తులో ఉంది. భూపాలపల్లి నుంచి అటవీ గ్రామాలకు వెళ్లే విద్యుత్ ప్రధాన లైన్ కావడంతో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. విద్యుత్‌శాఖ అధికారులు దృష్టి సారించి విద్యుత్‌లైన్ సరిచేయాల్సిన అవసరం ఉంది.
ములుగు రూరల్: ఆదిదేవత గట్టమ్మ తల్లికి మేడారం భక్తులు మొక్కులు చెల్లించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో మేడారం సమ్మక్క–సారలమ్మ దర్శనానికి బయలుదేరిన భక్తులు మొదటి మొక్కులు గట్టమ్మ తల్లికి చెల్లించారు. భక్తులు అమ్మవారికి పసుపు–కుంకుమలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న సమ్మక్క–సారలమ్మ గద్దెలకు పసుపు–కుంకుమ సమర్పించారు. అనంతరం మేడారం బయలుదేరి వెళ్లారు.
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క–సారలమ్మ పునఃప్రతిష్ఠాపన ప్రారంభోత్సవం, కేబినెట్ సమావేశానికి ఆదివారం సీఎంతో పాటు మంత్రులు మేడారానికి చేరుకోవడంతో ఏ రోడ్డు చూసినా వాహనాల రద్దీ కనిపించింది. అధికారుల వాహనాలతో రోడ్డు కిక్కిరిసిపోయింది. హరిత హోటల్, బస్టాండ్, మేడారం గద్దెల రోడ్ల గుండా వెళ్లేందుకు అధికారులు, రాజకీయ నాయకుల వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చి మిగితా భక్తుల వాహనాలను దారి మళ్లించారు. వన్‌వే ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. వాహనాల మళ్లింపుపై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రైవేట్ వాహనాలను గద్దెల చుట్టు పక్కల ప్రాంతాలకు అనుమతించలేదు.
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆదివారం సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ, నందీశ్వరుని విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని శేషాద్రి కొనియాడారు.
మౌని అమావాస్య.. భక్తుల పూజలు
మౌని అమావాస్య.. భక్తుల పూజలు
మౌని అమావాస్య.. భక్తుల పూజలు
మౌని అమావాస్య.. భక్తుల పూజలు


