లెక్కలు తలకిందులు
వార్డుల వారీగా
రిజర్వేషన్ల వివరాలు..
మున్సిపాలిటీలో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి
భూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే భూపాలపల్లిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం శనివారం వెలువడిన వార్డుల వారీగా రిజర్వేషన్లు పలువురి ఆశలపై నీళ్లు చల్లాయి. గత ఎన్నికల రిజర్వేషన్ల సరళిని బట్టి ఈసారి తమకు అనుకూలంగా వార్డు కేటాయింపు ఉంటుందని ఆశించిన కొందరికి షాక్ తగిలింది.
2014, 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన రిజర్వేషన్లను విశ్లేషించుకుని ఈసారి కచ్చితంగా తమ సామాజిక వర్గానికే వార్డు రిజర్వేషన్ దక్కుతుందని ధీమాతో ఉన్న పలువురు ప్రధాన పార్టీల నాయకులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. శనివారం విడుదలైన అధికారిక జాబితాలో వార్డుల రిజర్వేషన్లు తలకిందులు కావడంతో ఆశావహులు ఒక్కసారిగా డీలా పడ్డారు. ముఖ్యంగా అన్ రిజర్వుడ్ ఆశించిన చోట ఎస్సీ, బీసీ కేటాయింపులు రావడం, జనరల్ అనుకున్న చోట మహిళా రిజర్వేషన్లు రావడం ఆశావహులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
తమ సొంత వార్డుల్లో రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో, ఆశావహులు ఇప్పుడు ‘ప్లాన్–బి’ అమలు చేసే పనిలో పడ్డారు. తమ సామాజిక వర్గానికి అనుకూలంగా ఉన్న పక్క వార్డుల వైపు దృష్టి సారిస్తున్నారు. మరికొందరు సొంత వార్డు వదులుకోలేక, మహిళా రిజర్వేషన్ వచ్చిన చోట తమ కుటుంబ సభ్యులు(భార్య లేదా తల్లి)ని బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నారు. పార్టీ మారుతూ అయినా సరే, అనుకూలమైన వార్డు నుంచి పోటీ చేయాలని కొందరు గట్టి పట్టుదలతో ఉన్నారు.
రిజర్వేషన్ల మార్పుతో మున్సిపాలిటీ పరిధిలో పాత సమీకరణాలన్నీ మారిపోయాయి. కొత్త ముఖాలు తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుండగా, సీనియర్ నాయకులు తమ ఉనికిని చాటుకోవడానికి ఇతర వార్డుల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో రాబోయే రోజుల్లో వార్డుల మధ్య అభ్యర్థుల మార్పిడి, కొత్త పొత్తులు ఆసక్తికరంగా మారనున్నాయి.
భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. ఎస్టీ 2, ఎస్సీ 6, బీసీ 7, అన్ రిజర్వుడ్ 15 స్థానాలు కేటాయించారు. మహిళలకు ఎస్టీ వార్డుల్లో 1, ఎస్సీ వార్డుల్లో 3, బీసీ స్థానాల్లో 3, అన్ రిజర్వుడ్‌లో 8 స్థానాలు కేటాయించారు. రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను శనివారం లాటరీ పద్ధతిలో కలెక్టర్ రాహుల్ శర్మ ఎంపిక చేశారు.
ఒకటవ వార్డు జనరల్ మహిళ, రెండో వార్డు బీసీ జనరల్, మూడో వార్డు జనరల్‌కు కేటాయించారు. 4వ వార్డు బీసీ జనరల్, 5 ఎస్సీ జనరల్, 6 బీసీ మహిళ, 7 జనరల్ మహిళ, 8 ఎస్సీ మహిళ, 9 జనరల్, 10 జనరల్ మహిళ, 11, 12, 13 జనరల్, 14 జనరల్ మహిళ, 15 ఎస్సీ జనరల్, 16, 17 జనరల్ మహిళ, 18 బీసీ జనరల్, 19 జనరల్, 20 ఎస్టీ జనరల్, 21 ఎస్టీ మహిళ, 22 బీసీ మహిళ, 23 జనరల్ మహిళ, 24 బీసీ మహిళ, 25 జనరల్ మహిళ, 26, 27 ఎస్సీ మహిళ, 28 ఎస్సీ జనరల్, 29 జనరల్, 30 బీసీ జనరల్‌కు కేటాయించారు.
చాలామందికి
అనుకూలంగా రాని వైనం
పక్క వార్డుల్లో పోటీకి సమాలోచనలు
లెక్కలు తలకిందులు
లెక్కలు తలకిందులు


