డివైడర్ల తొలగింపు
ఏటూరునాగారం: మహాజాతర సమయంలో 29వ తేదీన సమ్మక్కను చిలకలగుట్ట మీద నుంచి గద్దెలకు తీసుకొచ్చే ముందు మేడారం గ్రామంలోని సమ్మక్క గుడికి రావడం ఆనవాయితీ. అయితే గుడి ఎదుట ఉన్న ప్రధాన రహదారిపై ఇటీవల డివైడర్లను నిర్మించారు. సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో పూజారులు, ఆదివాసీలు, కుటుంబాలు, యువత, భక్తులు లక్షలాది మంది రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉండడం వల్ల ఈ డివైడర్లతో మరింత కిక్కిరిసిపోవడంతో పాటు అమ్మవారి సేవకు అడ్డు ఏర్పడే అవకాశం ఉందని పూజారులు తెలిపారు. దీంతో అధికారులు వెంటనే సెంట్రల్ లైటింగ్ పోల్స్, డివైడర్లను కూల్చి వేశారు. అధికారులకు ముందు చూపులేని తనంతో లక్షలాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


