24 అంశాలపై శిక్షణ
భూపాలపల్లి రూరల్: ఇటీవల ఎన్నికై న సర్పంచ్‌లకు 24 అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సర్పంచ్‌ల విధులు, బాధ్యతలు, నిధులు సమకూర్చడం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో 248 సర్పంచ్‌లు, 2,103 మంది వార్డు సభ్యులు ఉండగా.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ పక్కన గల ఎస్సీ, బీసీ హాస్టల్ నూతన భవనాల్లో సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఎస్సీ హాస్టల్‌లో 50మందికి, బీసీ హాస్టల్‌లో 50 మంది సర్పంచ్‌లకు మొత్తంగా 100 మందికి మొదటి విడతలో శిక్షణ ఇవ్వనున్నారు. వార్డు సభ్యులకు మండలకేంద్రాల్లో త్వరలో శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో బ్యాచ్‌కు ఐదు రోజుల పాటు శిక్షణ ఉండనుంది.
ఏఏ అంశాలపై అంటే..
గ్రామ పాలనలో వ్యవస్థలు, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీలకు అధికారాలు, సర్పంచ్‌లకు బాధ్యతలపై అవగాహన కల్పించనున్నారు. ప్రాథమిక లక్ష్యాలు, నాయకత్వ లక్షణాలు, పారిశుద్ధ్యం, సమావేశాలు, స్టాండింగ్ కమిటీల ఏర్పాటు, వన మహోత్సవం, నిధులపై ఆడిట్, ప్రజా ఆరోగ్యం, జనన, మరణాల నమోదు, ఈ అప్లికేషన్, ఆర్థిక ప్రణాళిక ఇలా 24 అంశాలపై అధికారులు శిక్షణ ఇవ్వనున్నారు.. అన్ని అంశాలపై పట్టు సాధించి గ్రామాభివృద్ధికి కృషి చేసే విధంగా ప్రోత్సహించనున్నారు. పంచాయతీలకు వచ్చిన నిధులు దుర్వినియోగం చేయకుండా పల్లె అభివృద్ధికి కృషిచేసేలా వివరించనున్నారు.
శిక్షణకు తప్పక రావాల్సిందే..
శిక్షణ సమయంలో బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకోనున్నారు. ఆధార్ లింక్ ద్వారా బయోమెట్రిక్ అంటెండెన్సు శిక్షణ కేంద్రంలో నమోదు చేసుకోవాలి. ఈ శిక్షణకు ప్రతీ సర్పంచ్ తప్పక హాజరు కావాలి. శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే పంది మంది మాస్టర్ ట్రైనర్లకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు.,
రెండు విడతల్లో శిక్షణ..
ఈనెల 19వతేదీ నుంచి 23వ తేదీ వరకు మొదటి విడతగా భూపాలపల్లి, కొత్తపల్లిగోరి, రేగొండ, మహదేవపూర్ , గణపురం మండలాల్లోని 100 మంది సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు. మేడారం జాతర పూర్తయిన తర్వాత రెండో విడత షెడ్యూల్ ప్రకటించి 148 మంది సర్పంచ్‌లకు విడతల వారీగా శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
రేపటినుంచి 100 మంది సర్పంచ్‌లకు ట్రైనింగ్
మేడారం జాతర తర్వాత రెండో విడత


