సంక్షిప్త సమాచారం | - | Sakshi
Sakshi News home page

సంక్షిప్త సమాచారం

Nov 29 2026 1:28 PM | Updated on Nov 29 2026 1:28 PM

వేదలో చిన్నారులకు స్వర్ణప్రాశన

జనగామ: పట్టణంలోని వేద ఆయుర్వేద పంచకర్మ వెల్నెస్‌ సెంటర్‌ 11వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఉచిత స్వర్ణప్రాశన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్‌ అంజిరెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులకు స్వర్ణప్రాశన చుక్కలు వేశారు.

ఎమ్మెల్యే కడియం పరామర్శ

లింగాలఘణపురం: మాజీ జెడ్పీటీసీ, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుడి వంశీధర్‌రెడ్డి నాయనమ్మ నర్సమ్మ హనుమకొండలో అనారోగ్యంతో మృతి చెందింది. కాగా, కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరామర్శించారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

నివాళి

జనగామ రూరల్‌: లయన్స్‌ క్లబ్‌ అంతర్జాతీయ సేవా సంస్థలో చేరిన అనతి కాలంలోనే అందరి ఆదరాభిమానాలు పొందిన పూర్వ రీజియన్‌ చైర్మన్‌ చందుపట్ల రవీందర్‌రెడ్డి గురువారం మృతి చెందాడు. కాగా, కుమారుడు, కుమార్తె విదేశాల్లో ఉండటంతో రెండు రోజుల అనంతరం శనివారం దహన సంస్కారం నిర్వహించారు. పరకాలకు చెందిన రవీందర్‌రెడ్డి జనగామ ఏబీవీ హైస్కూల్‌లో వ్యాయామ ఉపాధ్యయుడిగా పనిచేసి ఇక్కడే స్థిరపడ్డాడు. కాగా, అంతిమయాత్రలో పరకాల, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బంధుమిత్రులు లయన్‌ బంధువులు, స్థానిక ప్రముఖులు రాజకీయ నాయకులు పాల్గొని నివాళులర్పించారు.

అన్నదానం

జనగామ: పట్టణంలోని మాతా శిశు ఆస్పత్రి ఆవరణలో ప్రముఖ కాంట్రాక్టర్‌ దోర్నాల శ్రీహరి కుమారుడు శ్రవణ్‌ కుమార్‌ జ్ఞాపకార్థం ఆయన సోదరుడు దోర్నాల శశికాంత్‌, 15వ వార్డు కౌన్సిలర్‌ మారబోయిన పాండు యాదవ్‌ సహకారంతో అమ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ అధ్యక్షుడు మంతెన మణికుమార్‌, ప్రధాన కార్యదర్శి వంగ భీమ్‌రాజ్‌ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

జ్యోతిరావు పూలే వర్ధంతి

జనగామరూరల్‌/కొడకండ్ల/బచ్చన్నపేట: మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పలు మండలాల్లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో అధికారులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ

జఫర్‌గఢ్‌/బచ్చన్నపేట: వరంగల్‌, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితా అభ్యంతరాల స్వీకరణ కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసినట్లు జఫర్‌గఢ్‌ తహసీల్ధార్‌ శ్రీనివాస్‌, బచ్చన్నపేట జీపీఓ సూర్యప్రకాశ్‌ తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ ప్రత్యేక క్యాంపులను వారు వేర్వేరుగా ప్రారంభించి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో పేరు నమోదైందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడంతో పాటు తప్పులు సవరణ చేసుకునే అవకాశాన్ని ఓటర్లకు కల్పించామన్నారు.

బీపీ, షుగర్‌లను నియంత్రణలో ఉంచుకోవాలి

కొడకండ్ల: బీపీ, షుగర్‌ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటూ వాటిని నియంత్రణలో ఉంచుకోవాలని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి భారతి సూచించారు. శనివారం కొడకండ్ల లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో నిర్వహించిన ఉచిత బీపీ, షుగర్‌ పరీక్షల శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రోగులతో పాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్లర్లకు పరీక్షలు నిర్వహించారు.

ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

బచ్చన్నపేట: ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కట్కూర్‌ గ్రామ సర్పంచ్‌ బళ్ల రవీంద్రనాథ్‌ అన్నారు. శనివారం గ్రామంలో ఘనపూర్‌, మేడ్చల్‌ మెడిసిటీ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు పలువురికి వివిధ రకాల పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

రాష్ట్రస్థాయి కబడ్డీ విజేత సాద్విత

నర్మెట: వెల్దండ ఉన్నత పాఠశాల విద్యార్థిని రాచకొండ సాద్విత అండర్‌–14 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రథమ స్థానం సాధించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో ఈనెల 22, 23, 24 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభతో విజేతగా నిలిచి కప్పు, ప్రశంస పత్రంతో శనివారం పాఠశాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంఈఓ మడిపల్లి ఐలయ్య, పీడీ మాధవి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఆమెను ఘనంగా సన్మానించి అభినందించారు.

భూ రీసర్వే పారదర్శకంగా నిర్వహించాలి

రఘునాథపల్లి: భూముల రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని తహసీల్దార్‌ రాజేష్‌రెడ్డి రెవిన్యూ సిబ్బందికి సూచించారు. శనివారం మండలంలోని ఇబ్రహీంపూర్‌లో భూ సర్వే ప్రారంభించగా ఆయన క్షేత్రస్థాయిలో సిబ్బందికి పలు సూచనలు చేశారు.

రీసర్వేకు సహకరించాలి

కొడకండ్ల: భూరీసర్వే కార్యక్రమానికి రైతులు సహకరించాలని తహసీల్దార్‌ ఉత్తలూరి అనీల్‌బాబు కోరారు. మొండ్రాయిలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

సహకార సంఘాల

పునర్వ్యవస్థీకరణకు నోటిఫికేషన్‌

జనగామ రూరల్‌: జిల్లాలో సహకార ఉద్యమాన్ని, సహకార పరపతి వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో స్టేషన్‌ఘన్‌పూర్‌, నర్మెట్ట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను విభజించి, చిల్పూర్‌, తరిగొప్పుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలుగా పునర్వ్యవస్థీకరించేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా సహకార శాఖ అధికారి కరుణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్‌ 5 లోపు సర్వసభ్య సమావేశం నిర్వహణ, అభ్యంతరాల స్వీకరణ డిసెంబర్‌ 18 లోపు, తుది ఉత్తర్వులు జారీ జనవరి 1న, రిజిస్టేషన్‌ సర్టిఫికేట్ల జారీ జనవరి 7న ఉంటుందన్నారు.

చిల్పూరు ఆలయ అభివృద్ధికి

రాజయ్య చేసింది శూన్యం

చిల్పూరు: బీఆర్‌ఎస్‌ 10 ఏళ్ల పాలనలో ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య చిల్పూరు ఆలయ అభివృద్ధికి చేసింది శూన్యమని ఆలయ ధర్మకర్త పుల్యాల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని పల్లగుట్ట గ్రామంలో చిల్పూరు ఆలయ చైర్మన్‌ శ్రీధర్‌రావు నివాసంలో శనివారం ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిల్పూరు ఆలయాన్ని రాజయ్య హయాంలోనే అభివృద్ధి చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఆలయ అభివృద్ధి ఎంపీ కావ్య, ఎమ్మెల్యే శ్రీహరి సహకారంతో చైర్మన్‌ శ్రీధర్‌రావు చేశారని అన్నారు.

ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఓటుతో బుద్ధి చెబుతాం

రఘునాథపల్లి: రజాకార్లను ఎదురించి తరిమి కొట్టిన పోరాట చరిత్ర లంబాడీలదని, తమ జాతీయ గౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదని ఎల్‌హెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొర్ర రాజేందర్‌నాయక్‌ అన్నారు. శనివారం కుసుంబాయితండా, వేలపగడ్డతండాల్లో జరిగిన గిరిజనుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. డిసెంబర్‌ 9న చేపట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి గిరిజనులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

డెయిరీ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించొద్దు

జనగామ రూరల్‌: జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీ పాల శీతలీకరణ కేంద్రానికి చెందిన స్థలంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని నిర్మించొద్దని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్‌, పాడిరైతుల పరిరక్షణ సమీతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి సాదం రమేష్‌ కోరారు. ఈ మేరకు శనివారం మున్సిపల్‌ చైర్మెన్‌ కడకంచి బాలమణి, కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పార్టీ కార్యాలయ నిర్మాణానికి డెయిరీ స్థలం కేటాయించాలని మున్సిపల్‌ సమావేశం ఎజెండాలో పెట్టడానికి అధికారుపై ఒత్తిడి తీసుకురావడం సరికాదన్నారు.

మహిళా సంఘాల అభివృద్ధికి ప్రోత్సాహం

బచ్చన్నపేట: మహిళా సంఘాల అభివృద్ధికి గ్రామ పంచాయతీల నుంచి ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని గోపాల్‌నగర్‌ గ్రామ సర్పంచ్‌ పేరబోయిన కల్యాణి పర్శరాములు అన్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఝాన్సీ మహిళా సంఘం నూతన వీఓ భవనాన్ని శనివారం సర్పంచ్‌ ప్రారంభించి మాట్లాడారు.

విజయవంతం చేయాలి

రఘునాథపల్లి: హసన్‌పర్తిలోని ఎర్రగట్టు వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం కార్తీక మాస సామూహిక వన భోజన మహోత్సవనం నిర్వహించనున్నట్లు పద్మశాలీ సంఘం మీడియా ఇన్‌చార్జ్‌ చింతకింది కృష్ణమూర్తి తెలిపారు. శనివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పద్మశాలీ కులస్తులు పెద్ద సంఖ్యలో హాజరు కాగలరని కోరారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

జనగామ: జనగామ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ప్రధాన గేటు పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన ఈనెల 27వ తేదీ అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఆసుపత్రి ప్రధాన గేటు సమీపంలోని కూర్చునే బళ్లపై ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే 112కు సమాచారం అందించడంతో బ్లూకోట్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు జనగామ ప్రభుత్వ ఆస్ప త్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి పేరు, ఊరు తదితర వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement