జనగామ: జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో అక్రమాలకు అడ్డుకట్ట వేసి, నిర్వహణను గాడిలో పెట్టేందుకు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారించారు. మార్కెట్‌లో అస్తవ్యస్త నిర్వహణ, రైతులకు తెలియకుండా కాంటాలు వేయడం, ఈనాం ప్రక్రియకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి అంశాలపై ఇటీవల సాక్షిలో వరుస కథనాలు ప్రచురితం కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఇందులో భాగంగా ఈనెల 27న డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ (డీడీఎం), మార్కెట్ పర్సన్ ఇన్‌న్‌చార్జ్ పద్మావతి అర్ధరాత్రి వరకు మార్కెట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులు, చెక్‌పోస్టు, ఈనాం, కాంటాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతు సమక్షంలో ఈనాం ద్వారా సరుకు కాంటాలు వేయాల్సి ఉండగా, రైతు లేకుండా దడ్వాయిలు ఎలా కాంటాలు వేస్తున్నారని అక్కడి అధికారులను, సిబ్బందిని ప్రశ్నించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఇద్దరు దడ్వాయిలుతో పాటు కమిషన్ ఏజెంట్లు బీసీకే, కేఎల్‌ఎన్‌న్‌లకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేసినట్లు మార్కెట్ ఇన్‌న్‌చార్జి కార్యదర్శి శ్రీదేవి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ధాన్యం విక్రయించుకున్నానని, ఇందులో తన తప్పేమీ లేదని ఈ సందర్భంగా ఓ రైతు అధికారికి వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది.
వ్యాపారికి హెచ్చరిక..
తనిఖీల్లో ఓ వ్యాపారి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సరైన లెక్కలు చూపకపోవడంతో పాటు, అతడి వద్ద అదనంగా ఉన్న ఎక్స్‌పోర్ట్ పర్మిట్ (ఈపీ) బుక్కులను పద్మావతి గుర్తించారు. వెంటనే వాటిని అప్పగించాలని, లేకుంటే లైసెన్స్‌న్‌రద్దు చేస్తానని హెచ్చరించడంతో సదరు వ్యాపారి వాటిని అప్పగించినట్లు తెలిసింది. అలాగే చెక్‌పోస్టు వద్దకు వెళ్లిన డీడీఎం విజయవాడ–మహారాష్ట్ర జాతీయ రహదారిపై వెళ్తున్న సరుకు రవాణా లారీలను ఆపి తనిఖీ చేశారు. నిబం ధనలకు అనుగుణంగా లేని కొన్ని వాహనాలకు రశీదులు జారీ చేశారు.
ఒకే బిడ్డింగ్ విధానంపై కసరత్తు
మార్కెట్‌లో చిల్లర కాంటాలు, ఈనాం లేకుండా కాంటాలు వేయడం వల్ల మార్కెట్ ఆదాయానికి గండిపడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల 10న డీడీఎం ఆధ్వర్యంలో వ్యాపారులు, హమాలీలు, ఆడ్తీలు, అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుతం రెండు బిడ్డింగ్‌లు నిర్వహిస్తుండగా, అక్రమ కాంటాలను అరికట్టేందుకు ఒకే బిడ్డింగ్ విధానాన్ని అమలు చేసే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా మార్కెట్‌కు ప్రత్యేక శ్రేణి రెగ్యులర్ కార్యదర్శిని నియమించి, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, పారదర్శక పాలన అందించాలని రైతులు, నాయకులు కోరుతున్నారు.
జిల్లా మార్కెట్‌లో
డీడీఎం ఆకస్మిక తనిఖీలు
ఇద్దరు దడ్వాయిలు,
కమిషన్ ఏజెంట్లకు నోటీసులు
అదనపు ఈపీ బుక్కుల స్వాధీనం


