● మరో రెండు అంశాలు
తదుపరి సమావేశానికి వాయిదా
జనగామ: పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్య నిర్వహణ, ప్రజా సమస్యలపై కౌన్సిల్‌లో చర్చించారు. శనివారం మున్సిపల్ సమావేశం హాలులో పురపాలిక చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి, వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇందులో పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కౌన్సిలర్లు, అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు చైర్‌పర్సన్ తెలిపారు. ఈ సందర్భంగా 67 అజెండా అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సిల్ ముందుంచగా, వాటిలో 65 అంశాలకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మిగిలిన రెండు అంశాలను మరింత సమగ్రంగా పరిశీలించేందుకు తదుపరి సమావేశానికి వాయిదా వేశారు. 67 అంశాలతో రూపొందించిన ఎజెండాలో గతంలో ఆమోదించిన అంశాలను మళ్లీ చేర్చడంపై 3వ వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతిగోపి ప్రశ్నించారు. వినాయక చవితి, మంత్రి పర్యటన ఖర్చుల లెక్కల్లో వ్యత్యాసాలను స్పష్టం చేయాలని కోరారు. సెంట్రల్ డివైడర్ పనుల నాణ్యతపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.


