జనగామ రూరల్: సూపర్ ఎల్‌నినోపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని, సాగునీటి లభ్యత లేని ప్రాంతాల్లో వరి సాగు చేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వ్యవసాయం, సాగునీరు, వర్షపాతం పరిస్థితులపై కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్‌లో వీసీ హాల్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్, జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, ఇరిగేషన్ శాఖ సీతారామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఈనెల 15 తర్వాత నీటి నిల్వల ఆధారంగా పంటలపై రైతులకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
మోడల్ పాఠశాలలో
ప్రవేశాలకు ఆహ్వానం
జనగామ రూరల్: మండలంలోని చౌడారం గ్రామంలోని పీఎంశ్రీ మోడల్ పాఠశాలలో ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీహరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మిగిలిపోయిన సీట్లకు, ఇంటర్ ఫస్టియర్ సీట్లకు స్పాట్ అడ్మిషన్ ఉందని శనివారం ఉదయం సంబంధిత సర్టిఫికెట్‌లతో పాఠశాల, కళాశాలకు హాజరు కావాలని కోరారు.
విద్యార్థుల నమోదు పెరగాలి
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా.. ప్రభుత్వ ప్రభు త్వపాఠశాలల్లో అత్యాధునిక సౌకర్యాలు, విద్యా ర్థులకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా అన్నారు. విద్యా కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత విద్యా సంవత్సరానికి 9,000 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు కృషిచేయాలని ఆదేశించారు.
ఆర్టీసీ అద్దె బస్సు అపహరణ
జనగామ: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపం హనుమకొండ రోడ్డులోని ఓ పెట్రోల్ బంక్ వద్ద పార్క్ చేసిన ఆర్టీసీ అద్దె బస్సును దుండగుడు అపహరించాడు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్‌గేట్ సమీపంలో బస్సును స్వాధీనం చేసుకున్నారు. జనగామ కురుమవాడకు చెందిన గంట గోపీ కృష్ణారెడ్డికి చెందిన టీఎస్ 27టీ7231 నంబర్ గల ఆర్టీసీ అద్దె బస్సు రోజు వారీ విధులు ముగించుకున్న అనంతరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద పార్క్ చేశారు. గురువారం తెల్లవారుజామున డ్రైవర్ విధులకు రావడంతో బస్సు కనిపించలేదు. దీంతో వెంటనే యజమాని గోపీకృష్ణారెడ్డికి సమాచారం ఇచ్చాడు. అనంతరం 100 డయల్‌కు సమాచారం అందడంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో సూర్యాపేట ప్రధాన రహదారి దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్‌గేట్ సమీపంలో రోడ్డు పక్కనున్న డివైడర్‌ను ఢీకొని నిలిచి ఉన్న బస్సును పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న దేవరుప్పుల ఎస్సై సృజన్ అక్కడికి చేరుకుని బస్సును స్వాధీనం చేసుకుని జనగామకు తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సును తీసుకెళ్లిన వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని అనుమానిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై బస్సు యజమాని గంట గోపీకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జనగామ సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు.
భారత బ్యాడ్మింటన్ జట్టుకు శ్రీచేతన్‌శౌర్య ఎంపిక
కొడకండ్ల: మండలంలోని లక్ష్మక్కపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ కుమారుడు సామల శ్రీచేతన్ శౌర్య అండర్ –15 బాలుర బ్యాడ్మింటన్ భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్నాడు. గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందిన శ్రీచేతనశౌర్య బెంగళూరులో జరిగిన అఖిల భారత సబ్ జూని యర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ చాటి అండర్– 15 బాలుర డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకం, సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించాడు. దీంతో సెప్టెంబర్‌లో చైనాలో జరిగే ఏషియన్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత జట్టుకు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ప్రాతినిథ్యం వహించనున్నారు. ఈ సందర్భగా ఎంఈఓ గ్రేస్‌కేజియారాణి, హెచ్‌ఎం రమేశ్‌శర్మ, ఉపాధ్యాయులు.. శ్రీచేతన్‌శౌర్యకు శుభాకాంక్షలు తెలిపారు.


