● నేడు మూడు సొసైటీల్లో పోలింగ్
● ఇప్పటికే 9 సొసైటీలు ఏకగ్రీవం
జనగామ: జిల్లా చేనేత సహకార సంఘాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జిల్లాలోని 12 చేనేత సహకార సంఘాల్లో తొమ్మిది సంఘాలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా, మిగిలిన మూడు సంఘాల్లో నేడు(శుక్రవారం) ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బ్యాలె ట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించి, అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు.
మూడు సొసైటీల్లో పోలింగ్...
తొమ్మిది ఏకగ్రీవం
జిల్లాలో జనగామ వీవర్స్ కాలనీలోని భారత్ టీసీ జెడ్‌బీ హెచ్‌డబ్ల్యూసీఎస్ లిమిటెడ్, జనగామ సంజయ్‌నగర్ ప్రాజెక్టు హెచ్‌డబ్ల్యూసీఎస్ లిమిటెడ్, పాలకుర్తి మండలం గూడూరు హెచ్‌డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ సంఘాల్లో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన బచ్చన్నపేట మార్కండేయ, స్టేష న్‌ఘన్‌పూర్ హెచ్‌డబ్ల్యూసీఎస్, కొత్తపల్లి శ్రీ వెంకటేశ్వర, బచ్చన్నపేట శ్రీ సిద్ధేశ్వర, సీతారాంపురం శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర, నీర్మాల శ్రీ భావన ఋషి, కంచనపల్లి హెచ్‌డబ్ల్యూసీఎస్ లిమిటెడ్, శ్రీ పద్మావతి కొడకండ్ల, శ్రీనివాస పవర్ లూం తదితర సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.
మెజారిటీ స్పష్టంగా ఉంటే..
ప్రతీ సహకార సంఘంలో తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకోనుండగా, అందులో ఇద్దరు మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. ఎన్నికైన డైరెక్టర్లలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి తదితర పదవులను ఎంపిక చేస్తారు. ఫలితాల అనంతరం ఐదుగురు డైరెక్టర్ల మెజారిటీ స్పష్టంగా ఉంటే వెంటనే పాలక వర్గాన్ని ప్రకటిస్తారు. ఒకవేళ మెజారిటీపై స్పష్టత లేకుంటే మూడు రోజుల గడు వు ఇచ్చి పాలకవర్గ ఎన్నికను నిర్వహించనున్నారు.
రాజకీయ రంగు
చేనేత సహకార సంఘాల ఎన్నికలకు ఈసారి రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఏకగ్రీవం కాని మూడు సంఘాల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు తెర వెనుక చురుకుగా వ్యవహరించడంతో ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలను తలపించే స్థాయికి చేరుకున్నాయి.


