● మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
జనగామ: ఉద్యోగ విరమణ పొందిన 21 నెలలు గడిచినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకున్న రిటైర్డ్ టీచర్ పగిడిపల్లి మల్లయ్య మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న జిల్లా కేంద్రంలోని పూర్ణిమా కాలనీకి చెందిన మృతుడు మల్లయ్య కుటుంబాన్ని గురువారం టీఎన్‌జీఓ మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్, టీఎన్‌జీఓ మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డితో కలిసి మాజీమంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మల్లయ్య రాసిన 33 పేజీల సూసైడ్ నోట్‌లో కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.10.78 లక్షల జీపీఎఫ్ బకాయిలు అందక తీవ్ర మనోవేదనకు గురయ్యానని స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల ఆర్థిక సహాయానికి అదనంగా రూ.1 కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. టీఎన్‌జీఓ మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ..రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సిన సొంత డబ్బుల కోసం హైకోర్టును ఆశ్రయించి, ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎన్‌జీఓ మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మల్లయ్య మృతికి కారణమైన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, టీఎన్‌జీఓ ప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.


