‘లెక్క’ తప్పారు! | - | Sakshi
Sakshi News home page

‘లెక్క’ తప్పారు!

May 2 2026 7:56 AM | Updated on May 2 2026 7:56 AM

గణితంలో అత్యధికంగా 79 మంది ఫెయిల్‌

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఆ తర్వాత సైన్స్‌ పరీక్షలో 50మంది విద్యార్థులు

మొత్తంగా జిల్లాలో ఉత్తీర్ణులు కానిది 198 మంది

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఖరారు

జనగామ: పదో తరగతి వార్షిక పరీక్షల్లో సబ్జెక్టుల వారీగా ఫెయిల్యూర్స్‌ నమోదు ఆందోళన కలిగిస్తోంది. సబ్జెక్టుల వారీగా పలవురు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ప్రతీ సబ్జెక్టులో విద్యార్థులు ఎందుకు ఫెయిల్‌ అయ్యారన్న దానిపై విశ్లేషణ జరపాల్సి ఉంది. జిల్లాలోని విద్యార్థుల అభ్యాసన విధానం, బోధనా ప్రమాణాలు, ప్రాథమిక అవగాహన లోపం వంటి కారణాలు ఉండొచ్చని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

6,443 మంది పరీక్షకు హాజరు

మార్చిలో నిర్వహించిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో 6,443 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 3,105 మంది బాలురు, 3,338 మంది బాలికలు ఉన్నారు. వీరిలో 6,292 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో 3,013 మంది బా లురు, 3,279 మంది బాలికలు ఉన్నారు. 183 పాఠశాలల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 32 ప్రైవే ట్‌ పాఠశాలలు, 58 ఉన్నత పాఠశాలలు, 8 కేజీబీ వీలు, 4 మోడల్‌ పాఠశాలలు, 4 బీసీ వెల్ఫేర్‌ పాఠశాలలు, 1 ఎయిడెడ్‌, 1 రెసిడెన్షియల్‌, 2 మైనారిటీ, 2 సోషల్‌ వెల్ఫేర్‌, 1 ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి.

తెలుగులో 29 మంది

మాతృభాష తెలుగులో 29 మంది విద్యార్థులు ఫెయిల్‌ కావడం గమనార్హం. సాధారణంగా ఈ విషయంలో ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే పరిస్థితి ఉండేది. అయితే రచనా శైలి, వ్యాకరణ అవగాహన లోపం, పాఠ్యాంశాలపై నిర్లక్ష్యం వంటి అంశాలు ఫలితాలను ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దీర్ఘ ఉత్తర ప్రశ్నల రచనలో విద్యార్థులు మార్కులు కోల్పోయినట్లు విశ్లేషిస్తోంది. హిందీ విషయంలో ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఫెయిల్‌ కావడంతో ఈ సబ్జెక్ట్‌లో మొత్తం విద్యా బోధన స్థిరంగా ఉన్నట్టు అర్థమవుతోంది.

ఇంగ్లిష్‌లో 28 మంది

ఇంగ్లిష్‌లో 28 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోవడం సాధారణంగానే ఉన్నప్పటికీ, భాషపై ప్రాథమిక అవగాహన లోపం, స్పెల్లింగ్‌ తప్పులు, గ్రామర్‌లో నిర్లక్ష్యం, రీడింగ్‌, రైటింగ్‌ స్కిల్స్‌ బలహీనత కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా వ్యాసరచన, లెటర్‌ రైటింగ్‌ ప్రాంతాల్లో తక్కువ మార్కులు పొందినట్లు స్పష్టమైంది.

గణితంలో 79 మంది

రికార్డు స్థాయిలో గణితం సబ్జెక్టులో అత్యధికంగా 79 మంది ఫెయిల్‌ శాతం నమోదైంది. ఈ ఫెయిల్యూర్‌ రేటుతో జిల్లాలో మ్యాథ్స్‌ బోధనపై ప్రశ్నార్థకం ఏర్పడింది. ఫార్ములాల పట్ల అవగాహన లేకపోవడం, సున్నితమైన కాన్సెప్ట్‌లను గ్రహించడంలో ఇబ్బంది పడడం, సమస్యలను దశల వారీగా పరిష్కరించే నైపుణ్యం లోపించడం వంటి కారణాలు విద్యార్థుల పనితీరు తగ్గడానికి దారి తీశాయనే చర్చ ఉంది.

సైన్స్‌లో 50 మంది

సైన్స్‌లో 50 మంది విద్యార్థులు ఫెయిల్‌ కావడం కూడా ఆందోళనకరమే. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం విభాగాల్లో ప్రయోగాత్మక అవగాహన లోపం, డయాగ్రామ్‌లు సరిగా రాయకపోవడం, సిద్ధాంతాత్మక ప్రశ్నల్లో అ స్పష్టత ప్రధాన కారణాలుగా గుర్తించినట్లు తెలుస్తోంది. సాంఘికశాస్త్రంలో 9 మంది మాత్రమే ఫెయిల్‌ కావడం ఒక రకంగా స్థిరమైన ఫలితంలా కనిపిస్తుంది.

పరీక్ష ఫీజుల చెల్లింపులు

అభ్యర్థులు పరీక్ష ఫీజును సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల వద్ద ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల14వ తేదీ వరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, 15వ తేదీ వరకు హెచ్‌ఎం, ఈఎన్‌ఆర్‌ను ఆన్‌లైన్‌ ద్వారా డీఈఓకు సమర్పించాల్సి ఉంటుంది. 16వ తేదీ నాటికి డీఈఓలు ఈఎన్‌ఆర్‌ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయానికి ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాలి. రూ.50 ఆలస్య రుసుముతో సంబంధిత సబ్జెక్టు పరీక్షకు రెండు రోజుల ముందుగా చెల్లించే అవకాశం కల్పించారు.

రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు జూన్‌లో నిర్వహించనున్న అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించింది. జూన్‌ 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయి. 5వ తేదీన ఫస్ట్‌ లాంగ్వేజ్‌ గ్రూప్‌–ఏ పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటుంది. ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పార్ట్‌–1 (కంపోజిట్‌ కోర్సు) ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50, ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పార్టు–2 (కంపోజిట్‌ కోర్సు) ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు జరుగనుంది. 6వ తేదీన సెకండ్‌ లాంగ్వేజ్‌ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30, 7వ తేదీ ఇంగ్లిష్‌ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30, 8వ తేదీన గణితం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30, 9న సైన్స్‌ పార్ట్‌–1 (ఫిజికల్‌ సైన్స్‌) ఉదయం 9.30 నుంచి 11 గంటలు, 10న సైన్స్‌ పార్ట్‌–2 (బయోలాజికల్‌ సైన్స్‌) ఉదయం 9.30 నుంచి 11 గంటలు, 11న సాంఘిక శాస్త్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement