రేపటి నుంచి కొమ్మాల బ్రహ్మోత్సవాలు
గీసుకొండ: జిల్లాలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి వచ్చే నెల మార్చి 9 వరకు వైభవంగా జరగనున్నాయి. సోమవారం ఉదయం 8 గంటలకు అధ్యయనోత్సవం ప్రారంభం, 24న సాయంత్రం ప్రబంధ సేవాకాలం, 25న రాత్రి పరమపదోత్సవం, 26న అంకురారోహణం, రక్షాబంధనం, దీక్షావస్త్రధారణ, అగ్ని ప్రతిష్ఠ తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, ఈఓ ప్రసాద్ తెలిపారు. 27న రాత్రి 10 గంటలకు అమ్మవార్లు శ్రీదేవి, భూదేవితో స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. 28 నుంచి మార్చి 2 వరకు ప్రత్యేక పూజలు ఉంటాయని చెప్పారు. మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7.30 వరకు దేవాలయాన్ని మూసి వేస్తామని, రాత్రి 8 గంటల తర్వాత జాతర, బండ్లు తిరగడం, దర్శనాలు ఉంటాయని వివరించారు. మార్చి 7న స్వామివారి రథోత్సవం, ఉగాది వరకు జాతర కొనసాగుతుందని పేర్కొన్నారు.


